ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చలించిపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు. విభజన హామీలు అమలుపర్చకపోగా, కేంద్ర ప్రభుత్వం ఎగతాళి చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ప్రత్యేక హోదా పై తీర్మానం చేసిన ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా రాజధాని నిర్మాణం విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. విభజన తర్వాత కట్టుబట్టలతో వచ్చిన ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణానికి సయితం కేంద్రం సహకరించడం లేదని చంద్రబాబు ఆవేదన చెందారు.
ఎగతాళిఎందుకు?
రైతులు 40 వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వం అడిగిన వెంటనే ఇచ్చారని, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మాదిరిగా రాజధాని ఉండాలని ఆశించడం తప్పా? అని ప్రశ్నించారు. అంతర్జాతీయ నగరాన్ని నిర్మించాలన్న తన ఆశయాన్ని కేంద్రం ఎగతాళి చేస్తుందన్నారు. రాజధాని కోసం 2500 కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతోందని, కాని గుంటూరు, విజయవాడ నగరాలకు భూగర్భ డ్రైనేజీకి వెయ్యి కోట్లు ఇచ్చి దానిని కూడా రాజధాని ఖాతాలో వేసిందన్నారు. రైతులు స్వచ్ఛందంగా తమ భూములు రాజధాని కోసం ఇస్తే ప్రభుత్వం తిరిగి ప్రజలకు ఏమిచ్చిందని ప్రశ్నించుకోవాలన్నారు.
హామీలనే అమలు చేయాలి......
కేంద్ర ప్రభుత్వాన్ని తాను గొంతెమ్మ కోరికలేమీ కోరడం లేదని, విభజన చట్టంలో ఉన్న హామీలను, మోడీ ఇచ్చిన వాగ్దానాలను మాత్రమే అమలు చేయాలని కోరుతున్నానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సాయంతో తాను అంతర్జాతీయ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలనుకున్నానని, కాని కేంద్రం తన ఆశలపై నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పన్నులు చెల్లిస్తున్నా పట్టించుకోకపోవడమేంటన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరించి ఏపీని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ కలిసే రాష్ట్రాన్ని విభజించాయని, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత రెండు జాతీయ పార్టీలపై ఉందన్నారు. మొత్తం మీద చంద్రబాబు ప్రసంగం ఉద్వేగ భరితంగా సాగింది.