కర్ణాటక రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్ ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కర్ణాటక ప్రస్తుత ప్రభుత్వ కాలపరిమితి మే 28వ తేదీతో ముగియనుంది. అయితే విద్యార్థుల పరీక్షల కారణంగా కొంత ముందు వెనక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కన్పిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే కర్ణాటకలో ప్రచారాన్ని రెండు పార్టీలూ ఉధృతం చేశాయి. కర్ణాటకలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం నెలకొంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 24, 25, 26 తేదీల్లో పర్యటించారు.
బీజేపీ కంచుకోటలో రాహుల్.....
రాహుల్ గాంధీ ఎక్కువగా మోడీ సర్కార్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే మరొక వైపు లోకల్ టచ్ ఇస్తూ వెళుతున్నారు. లింగాయత్ లను ఆకట్టుకునేందుకు ఎక్కువగా ఆయన మూడు రోజుల పర్యటన సాగిందని చెప్పొచ్చు. బసవేశ్వరుడి ప్రవచనాలను రాహుల్ చెబుతూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నంచేశారు. అధిక సంఖ్యలో ఉన్న లింగాయత్ లను ఆకట్టుకునేందుకే రాహుల్ ఈ ప్రయత్నాలు చేశారంటున్నారు. ఇక జీఎస్టీ, నోట్ల రద్దు, పీఎన్బీ కుంభకోణం వంటి అంశాలను రాహుల్ ఎక్కువగా తన ప్రసంగాల్లో స్పృశించారు. నీరవ్ మోడీ దేశాన్ని ముంచి పరారవుతున్నా మోడీ పట్టించుకోలేదన్నారు రాహుల్. అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అందించిన పాలనను కూడా రాహుల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యంగా రాహుల్ ప్రసంగాలు స్థానికులను ఆకట్టుకున్నాయనే చెప్పొచ్చు. బీజేపీకి పట్టున్న ప్రాంతాల్లోనే రాహుల్ పర్యటన ఎక్కువగా సాగింది.
కాంగ్రెస్ కు పట్టున్న ప్రాంతంలో అమిత్ షా.....
ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సయితం కర్ణాటకలో మూడు రోజుల పాటు పర్యటించారు. ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ కూడా రైతు సదస్సులో పాల్గొన్నారు. అమిత్ షా ప్రసంగాలు ఎక్కువగా రాహుల్, కాంగ్రెస్ పార్టీలను తూర్పారపట్టడమే థ్యేయంగా సాగాయి. కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతంలో అమిత్ షా పర్యటించడం విశేషం. లోక్ సభ లో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కర్ణాటకలోనే వెనుకబడి ఉండటమేంటని అమిత్ షా ప్రశ్నించారు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చామని, కాంగ్రెస్ నలభై ఏళ్ల పాటు చేసిన తప్పులను తాము సరిదిద్డడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నామని చెప్పొకొచ్చారు. తమకు అధికారం అప్పగిస్తే మహదాయి వివాదాన్ని పరిష్కరిస్తామని షా హామీ ఇచ్చారు. ఇలా కర్ణాటకలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే రాజకీయ వేడి అలుముకుంది.
వీరిద్దరికీ కీలకం.....
రెండు పార్టీలూ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, వ్యూహకర్తలను ఇప్పటికే కర్ణాటకకు డంప్ చేయడంతో వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. రెండు పార్టీల ప్రచార సభకు ప్రజలు విపరీతంగా వస్తున్నారు. రెండు పార్టీల నేతలకూ అవినీతి మకిలి అంటుకుంది. సిద్ధరామయ్య ఇందులో కొంత బెటరనే చెప్పొచ్చు. గతంలో యడ్యూరప్ప పై వచ్చిన అవినీతి ఆరోపణలు పార్టీకి ఇబ్బందికరంగా మారతాయని భావించిన కమలనాధులు సిద్ధరామయ్య అవినీతినే ఎక్కువగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. మొత్తం మీద సిద్ధరామయ్య, యడ్యూరప్పలకు ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు ఓటమి పాలయినా వారికి వ్యక్తిగతంగా రాజకీయ ఇబ్బందులు తప్పవంటున్నారు.