అంతా ఆ తాను ముక్కలేనా..? రాజకీయాల్లో ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో అంచనా వేయలేం. అలాగే శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు వుండరు అన్నది చరిత్ర చూపిన పాఠం. తాజాగా కర్ణాటకలో పాగా వేయాలంటే ఎంఐఎం ను రంగంలోకి దించాలని మోడీ అమిత్ షా స్కెచ్ గీస్తున్నారుట. ఉత్తరాదిన జరిగిన ఎన్నికల్లో ముఖ్యంగా యుపిలో ఆ తరువాత మహారాష్ట్రలో ఎంఐఎం బరిలో నిలవడంతో ఓట్ల చీలికతో బిజెపి గణనీయ ఫలితాలు సాధించింది. ఇదే ఫార్ములా కర్ణాటకలోనూ అనుసరిస్తే అక్కడి సిద్ధరామయ్య సర్కార్ కి రామ్ రామ్ చెప్పేయొచ్చన్నది కమలనాధుల వ్యూహమని అంటున్నారు.
మత, కుల, ప్రాంత రాజకీయ పునాదులపైనే ...
దేశంలో ప్రజల సెంటిమెంట్స్ భావోద్వేగాలు ఓటు బ్యాంక్ లుగా మలుచుకోవడం రాజకీయపార్టీలకు ఆదినుంచి వెన్నతో పెట్టిన విద్యే. కాంగ్రెస్ ఈ తరహా రాజకీయాలు లౌకిక వాదం పేరుతో సాగిస్తూ దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించింది. ఇప్పుడు మోడీ అమిత్ షా ద్వయం ఈ సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా అమల్లో బాగా పెడుతున్నారని గత మూడున్నరేళ్లుగా అందరికి అర్ధమైంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాజకీయాలను స్టడీ చేసిన బిజెపి అధిష్టానం అక్కడ కాంగ్రెస్ వెన్నెముక విరగొట్టాలంటే ముస్లిం ఓటు బ్యాంక్ ఆ పార్టీకి దూరం చేయాలనే ఎత్తుగడ చేసింది. అందులో భాగంగా ఎంఐఎం తో రహస్య మంతనాలు జరిపిందన్నది కర్ణాటక ముఖ్యమంత్రే స్వయంగా ఆరోపించడం గమనార్హం. ఈ స్ట్రేటజీ వాస్తవం అయితే మత రాజకీయాలు చేసే బిజెపి, ఎంఐఎం పార్టీలు దేశ ప్రజలతో వారి విశ్వాసాలతో ఆటలు ఆడుతూ అధికారం దక్కించుకోవడమే పరమావధిగా గ్రహించి అంతా చైతన్యవంతం కావాలిసి ఉంటుంది. హిందూ, ముస్లిం ల నడుమ విభేదాలు సృస్ట్టించే వారు వారి లబ్ది కోసమే ఇదంతా చేస్తున్నారన్నది గుర్తుపెట్టుకుని భావోద్వేగాలను నియత్రించుకోవాలి, కుల, మత ప్రాంతాల నడుమ రాజకీయం సృష్టించే అగాధాలను అధిగమించాలి.