కనిగిరిలో కన్నీళ్లు....!

Update: 2018-02-23 01:30 GMT

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో జరుగుతుంది. 95వ రోజు పాదయాత్రను జగన్ మధ్యాహ్మానికే ముగించి హైదరాబాద్ కు బయలుదేరారు. ఆయన శుక్రవారం సీబీఐ కోర్డుకు హాజరుకావాల్సి ఉండటంతో రోడ్డు మార్గాన జగన్ హైదరాబాద్ బయలు దేరి వచ్చారు. మరికాసేపట్లో సీబీఐ కోర్టుకు జగన్ హాజరు కావాల్సి ఉంది. 95వ రోజు జగన్ కనిగిరి నియోజకవర్గంలో పీసీ పల్లి మండలం అలవలపాడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి రామాపురం, గుదేవారిపాలెం, హజీస్ పురం వరకూ చేరుకున్న తర్వాత పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఇప్పటి వరకూ జగన్ 1275 కిలోమీటర్లను నడిచారు.

సమస్యలను చెప్పుకుంటూ...విలపిస్తూ....

వైసీపీ అధ్యక్షుడు జగన్ రాకకోసం కనిగిరి నియోజకవర్గంలో నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. రహదారి పొడవునా పెద్దయెత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వైసీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్ ఛార్జి బుర్రా మధుసూదన్ తోపాటుగా సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డిలు జగన్ వెంట నడుస్తున్నారు. జగన్ కు అనేకమంది తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ప్రధానంగా కనిగిరి ఫ్లోరైడ్ ప్రాంతం కావడం, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధ పడుతుండటంతో అనేక మంది జగన్ వద్దకు వచ్చి తమ గోడును విన్పించుకుంటున్నారు. కొందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

నేడు పాదయాత్రకు విరామం....

కిడ్నీ వ్యాధి బారిన పడిన వారికోసం డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జగన్ గతంలో జగన్ కనిగిరికి వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేసుకుంటున్నారు. కొందరు తమకు పింఛన్లు ఇంతవరకూ రాలేదని వాపోతున్నారు. ఇక రైతులు సరేసరి. తమకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, తాము ఎవరిని అడగాలో తెలియడం లేదని వారు వాపోతున్నారు. తమకు రుణమాఫీ అందలేదని కొందరు జగన్ కు ఫిర్యాదు చేశారు. జగన్ ఈరోజు పాదయాత్రకు విరామమిచ్చారు. తిరిగి శనివారం ఉదయం జగన్ కనిగిరి నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించనున్నారు.

Similar News