పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వరకు కత్తి మహేష్ ఎవరో ఎవరికి తెలియదు. అవసరమున్నా లేకున్నా బుల్లి తెరపైకి వచ్చి పవన్ పై ఘాటైన విమర్శలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న కత్తి మహేష్ వెనుక ఎవరున్నారు ? అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. కత్తి మహేష్ పదే పదే విమర్శలు చేయడం వెనుక జనసేన సైనికులను రెచ్చగొట్టడమే లక్ష్యమా ? లేక వైసిపి కార్యక్రమాల ప్రచారం అడ్డుకోవడం లక్ష్యమా ? అదికాక టిడిపి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు వైసిపి, జనసేన పై ఆడుతున్న గేమ్ నా ? అన్న చర్చ సోషల్ మీడియా కేంద్రంగా బాగా నడుస్తుంది.
తెలుగుదేశం అనుకూల మీడియా కు కత్తి దొరికింది ...
ఉభయ తెలుగురాష్ట్రాల్లో అనేక సమస్యలు ఇబ్బడి ముబ్బడిగా వున్నాయి. అవన్నీ వదిలి కత్తి మహేష్ చుట్టూ ఛానెల్స్ నడుస్తున్నాయి. దీనికి మరోకారణం కూడా వుంది. బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం తరువాత కత్తి మహేష్ పవన్ , జనసేన కి రేటింగ్స్ బాగా వస్తున్నాయి. దాంతో మాకో వివాదం కావలెను అన్నట్లు ఛానెల్స్ తరచూ ఏదో అంశంలో కత్తి ని చర్చలోకి లాగి రేటింగ్స్ బాగా పెంచుకునే పనిలోపడ్డాయి.
వైసిపి పై కుట్ర అని అనుమానిస్తున్న ఆ పార్టీ ...
తమ పార్టీ అధినేత చేస్తున్న పాదయాత్ర కవరేజ్ కానీ చర్చ కానీ లేకుండా చేసేందుకు, కాపు సామాజిక వర్గం ఓట్లు వైసిపికి రాకుండా చేసేందుకు టిడిపి అంతర్నాటకం ఆడుతుందన్నది వైసిపి వర్గాల అనుమానం. దాంతో కత్తి ఎపిసోడ్ లోకి వైసిపి వర్గాలు వెళ్ళకండి అంటూ సోషల్ మీడియా కేంద్రంగా ప్రచారం మొదలైంది. ఇక జనసేన వర్గాలు కత్తి పవన్ ను కించపరిస్తే అభిమానులు రెచ్చిపోయి ఏదోఒకటి చేస్తే రాజకీయ లబ్ధికోసం మిగిలిన పార్టీలు చూస్తున్నట్లు అనుమానిస్తున్నాయి. దాంతో ఆ పార్టీ సైతం తమ అభిమానులు సంయమనం పాటించాలని కోరుతుంది. రాజకీయ పార్టీ అన్నాకా విమర్శలు సహజమని ఆవేశపడి పార్టీకి చెడ్డ తేవొద్దన్నది జనసేన అభిమతం. మరోవైపు టిడిపి ఇలాంటి మైండ్ గేమ్ ఆటల్లో నిపుణత ఉందని ఇది చంద్రబాబు ప్రయోగించిన కత్తి అన్నది ఎక్కువ ప్రచారం సోషల్ మీడియా లో నడుస్తుంది. మొత్తానికి ఏదైతేనేమి కత్తి ని ఛానెల్స్ మాత్రం తుక్కు తుక్కు కింద వాడి రేటింగ్స్ తో కాసులు పండించుకుంటున్నాయి.