తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన వారసురాలిని రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకరకంగా ఇది మాజీ మంత్రి రాజయ్యకు చెక్ పెట్టడమే. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ కు రాజయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరి గత ఎన్నికల్లో విజయం సాధించారు. తొలి మంత్రి వర్గంలోనే చోటు సంపాదించుకున్నారు. తర్వాత అవినీతి ఆరోపణలు రావడంతో రాజయ్యను మంత్రి వర్గం నుంచి కేసీఆర్ తొలగించారు. రాజయ్య కొంత అసంతృప్తికి గురయినా టీఆర్ఎస్ లోనే ఉన్నారు. అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. కేసీఆర్ జరిపించిన రెండు సర్వేల్లోనూ రాజయ్యకు అరకొర మార్కులే వచ్చాయి. దీంతో రాజయ్యపై గులాబీ బాస్ కొంత అసంతృప్తిగా ఉన్నారన్నది పార్టీ నేతలందరికీ తెలిసిందే. కడియం శ్రీహరితో అనేకసార్లు అదే నియోజకవర్గంలో రాజయ్య ప్రత్యర్థిగా ఉన్నారు.
వారసురాలిగా కావ్య......
ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి వచ్చే ఎన్నికల్లో తన పెద్దకుమార్తె కావ్యను స్టేషన్ ఘన్ పూర్ నుంచి పోటీ చేయించాలని యోచిస్తున్నారు. కడియం కుమార్తె కావ్య ప్రస్తుతం వైద్య వృత్తిలో ఉన్నారు. తన తండ్రి బాటలోనే నడుస్తున్నానని ఆమె చెబుతున్నారు. ఇటీవల వరంగల్ లో టెక్సటైల్ మెగా పార్క్ శంకుస్థాపనకు వచ్చిన కేసీఆర్ నుంచి కూడా కావ్య ఆశీర్వాదం తీసుకున్నారు. గత కొంతకాలంగా కావ్య స్టేషన్ ఘన్ పూర్ లో జరిగే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శ్రీహరి కూడా తన కావ్య పొలిటికల్ ఎంట్రీపై కేసీఆర్ వద్ద చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద కడియం తన కూతురి కోసం రాజయ్య సీటుకు ఎర్త్ పెట్టారన్నది మాత్రం స్పష్టమవుతుంది.