కడప జిల్లా నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని అమలు పర్చడంలో నేతలు ఫెయిల్ అయ్యారని చంద్రబాబు నిర్మొహమాటంగా చెప్పారు. జిల్లాలోని ఎక్కువ నియోజకవర్గాలకు సీ గ్రేడ్ వచ్చిందని ఆయన నేరుగా చెప్పారు. తనకు అందిన నివేదికల ప్రకారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని సమిష్టిగా కాకుండా ఎవరికి తోచినట్లు వారు చేసుకుంటున్నారని ఆయన తీవ్రంగా మందలించారు. వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలో విజయకేతనం ఎగుర వేయాలని తాను చూస్తుంటే గ్రూపు తగాదాలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాలోని పది నియోజకవర్గాల్లో సి గ్రేడ్ రావడంపై ఆయన ఊగిపోయినట్లు తెలుస్తోంది. ఇలాగే కొనసాగితే ఇంటికి పంపుతామని తీవ్ర స్థాయిలో హెచ్చరించినట్లు సమాచారం.
ఇంటింటికి వెళ్లకుంటే ఇంటికే పంపుతా.....
కడప జిల్లా వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కావడంతో చంద్రబాబు దీనికి హై ప్రయారిటీ ఇస్తున్నారు. నిధులు కూడా కోట్లలో విడుదల చేస్తున్నారు. నీరు-చెట్టు పథకం కింద ఒక్క కడప జిల్లాకే 600 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఈ పనులన్నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలన్నది పార్టీ ఉద్దేశం. ఈ మేరకు కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో జగన్ ను దెబ్బకొట్టాలన్నది ఆయన వ్యూహం. కాని తెలుగు తమ్ముళ్లు మాత్రం కడప జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో గ్రూపులు కట్టి ఎవరి దారి వారిదేనంటున్నారు. కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రైల్వేకోడూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో రెండు గ్రూపులయి పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో పార్టీ కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. దీంతో చంద్రబాబు సీరియస్ గానే ఉన్నట్లు సమాచారం. జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిలు వేర్వేరుగా కార్యక్రమాలను నిర్వహిస్తుండటాన్ని కూడా చంద్రబాబు తప్పుపట్టారు. ఇలాగే కొనసాగితే ఇంటికి పంపుతానని హెచ్చరికలు జారీ చేశారు. మరి బాబు హెచ్చరికలు కడప నేతల చెవికెక్కుతాయా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.