ఓట్లు కోసం రాలేదన్న పవన్....!

Update: 2018-01-27 07:30 GMT

అనంతపురం గుత్తి రోడ్డులో జనసేన పార్టీ కార్యాలయానికి పార్టీ అధినతే పవన్ కల్యాణ్ భూమి పూజ చేశారు. తాను గతంలో అనంతపురం వచ్చినప్పుడే తాను తొలి పార్టీ కార్యాలయాన్ని అనంతపురం లో ఏర్పాటు చేస్తానని ప్రకటించానన్నారు. కరవు సీమగా పేరొందిన ఈ జిల్లా నుంచే తన ప్రయాణం ప్రారంభిస్తున్నానన్నారు. ప్రజాసమస్యల పరిష్కరానికి,సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చానన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. జీవితంలో గెలుపోటముల గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటానన్నారు. ఎలాంటి ఒడిదుడుకులెదురైనా జనసేనను ముందుకు తీసుకెళతనాన్నారు. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానన్నారు. తాను మీ ఇంట్లో వాడిగా వచ్చానని, మద్దతు ఇవ్వమని చెప్పారు. తాను వచ్చింది ఓట్లకోసం కాదని, తాను పనిచేసుకుంటూ వెళతానని, తన పని నచ్చితేనే తనకు ఓటు వేయాలన్నారు. ఓటు వేయకున్నా... వేసినా తాను పట్టించుకుంటోనన్నారు. తాను ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనన్నారు. తాను ప్రజాపక్షంలోనే ఉంటానని చెప్పారు పవన్ కల్యాణ్.

సీమ వెనకబాటు అంటు ఒప్పుకోను...

రాయలసీమ వెనకబడి పోయిందనడం తనకు నచ్చదన్నారు. రాయలసీమ అనగానే తనకు తరిమెల నాగిరెడ్డి, నీలం సంజీవరెడ్డి కన్పిస్తారని, ఫ్యాక్షన్ అస్సలుకన్పించదన్నారు. రాయలసీమ పట్ల అపరిమితమైన ప్రేమ ఉందన్నారు. రాయలసీమలో పుట్టకపోయినా.. తన ప్రాణం ఉన్నంత వరకూ సీమకు అండగా ఉంటానని పవన్ మాట ఇచ్చారు. 2019 ఎన్నికల గురించి తాను ఆలోచించడం లేదని, వచ్చే పాతికేళ్ల గురించి తాను ఆలోచిస్తున్నాననిచెప్పారు. నీటిపారుదల నిపుణులను ఢిల్లీ కి తీసుకెళ్లి అవసరమైతే ప్రధానితో మాట్లాడతామని చెప్పారు. రాయలసీమలో నీటి ఎద్దడి తొలగించేందుకు పోరాటం చేద్దామని చెప్పారు. రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, ఆందోళను చేయమని చెప్పనన్నారు. తాను ఒక్కడినే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తనపై ఎలాంటి దాడులు చేసినా.. వ్యాఖ్యలు చేసినా పట్టించుకోనని చెప్పారు.

యువరక్తాన్నే నమ్ముతా....

‘‘నేనేంటో మీకు తెలుసు. నెనాలంటి వ్యక్తినో మీకు తెలుసు. 20 ఏళ్ల నుంచి నా సినిమాలుచూసి మీరు పెరిగారు. రాయలసీమ సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడతా. పరిష్కారానికి కృషి చేస్తా. పవన్ మీకు అండదండలుగా ఉంటాడు. 2008 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. అనేక వత్తిళ్లు ఎదుర్కొన్నా. పడేప్రతి దెబ్బ నన్ను రాటుదేలేలా చేసింది. మీ భవిష్యత్ కోసమే వచ్చా. నేను నమ్మేది యువరక్తాన్నే. ఉడుకు రక్తాన్నే. కాని నేను నమ్మేది ఆడపడుచులనే. యువత 2019 ఎన్నికల్లో ఎలాంటి మార్పు తీసుకురాబోతోందన్నది నిరూపిద్దాం. రాజకీయాల్లో నాకు ఎవరూ శత్రువులు లేరు. వ్యక్తిగతంగా నాకు అందరూ సన్నిహితులే. రాజకీయంగానే వారితో విభేదిస్తా. విద్య, వైద్యం అందరికీ ఉచితంగా, నాణ్యతమైనది అందాలి. ఎవరైనా నా విధానాల్ని తప్పు దోవ పట్టించే విధంగా చెబితే మీరు పట్టించుకోవద్దు. అనంతపురం అభివృద్ధికి నా వంతు సాయం చేస్తా. పరిష్కారాలను వెదకబోయే ముందు ప్రతి సమస్యను అవగాహన చేసుకునేందుకే అనంతపురం వచ్చా. ’’అని పవన్ కల్యాణ్ తెలిపారు.

Similar News