జగన్ పార్టీ జెండా ఈ నియోజకవర్గంలో ఎగరలేదు. గత ఎన్నికల్లో కూడా మూడో స్థానంలోకి వెళ్లిన వైఎస్సాఆర్ పార్టీ ఇప్పుడు గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. తెలుగుదేశం పార్టీలోని గ్రూపు తగాదాలే తమకు కలిసి వస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం కాంగ్రెస్, టీడీపీలు పోటా పోటీగా గెలిచాయి. అదే ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గం. వస్త్ర పరిశ్రమకు పేరుగాంచిన చీరాల నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర జరుగుతోంది. చీరాల నియోజకవర్గంలో వైసీపీకి పెద్దగా పట్టులేదు. ఇది గత ఎన్నికల ఫలితాలను బట్టిచూస్తేనే తెలిసిపోతోంది.
కాంగ్రెస్, టీడీపీలను ఆదరిస్తూ....
చీరాల నియోజకవర్గం 1962లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు గెలుస్తూ వస్తున్నాయి. స్వంతంత్ర అభ్యర్థులు సయితం ఇక్కడ గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 1989, 2004లో ఇక్కడి నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. అయితే 2009 ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ గెలుపొందారు. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో ఆమంచి కృష్ణమోహన్ నవోదయం పార్టీ పేరుతో పోటీ చేసి ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థిని పోతుల సునీతపై విజయం సాధించారు. ఆ తర్వాత ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి మద్దతిచ్చారు.
చీరాలలో సమస్యల వెల్లువ....
ఈనేపథ్యంలో జగన్ పాదయాత్ర చీరాల నియోజకవర్గంలో ప్రారంభమైంది. రాధాకృష్ణ నగర్, అంబేద్కర్ నగర్ కాలనీ మీదుగా జగన్ పాదయాత్ర సాగింది. వేటపాలెం వరకూ పాదయాత్ర సాగింది. అయితే చీరాల నియోజకవర్గంలో జగన్ కు తమ సమస్యలను ప్రజలు విన్నవించుకున్నారు. అంబేద్కర్ కాలనీలో తాగునీరు రావడం లేదని, రోడ్లు వేయలేదని జగన్ కు మహిళలు ఫిర్యాదు చేశారు. తాము అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని చెప్పారు. ఇందుకు స్పందించిన జగన్ వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.