ఓటమిపై యోగి నిజం చెప్పేశారు

Update: 2018-03-18 17:30 GMT

ఉత్తర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన గొరఖ్ పూర్, ఫూల్ పూర్ ఉప ఎన్నికల్లో ఓటమికి అతి విశ్వాసమే కారణమని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ అంగీకరించారు. వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంలో తాము విఫలమయ్యామని ఆయన అంగీకరించారు. ఈ ఓటములు తమకు ఒక గుణపాఠంగా నేర్పాయన్నారు యోగి. యోగి ఆదిత్యానాధ్ ఒక ప్రయివేటు ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో యూపీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు.

అంచనాలో విఫలం....

పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమవ్వడమే కాకుండా, అతివిశ్వాసమే తమ కొంపముంచిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును అందరూ అంగీకరించాల్సిందేనన్నారు. రెండు ఉప ఎన్నికల్లో ఓటమిని తాము విశ్లేషించుకుని భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని చెప్పారు. విశ్లేషణల్లో ఓటమికి ఎవరు బాధ్యత వహించాలి? ఎవరిపై చర్యలు తీసుకోవాలన్నది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

కూటమికి నేత ఎవరు?

అలాగే ఈ ఉప ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటయిన కూటమిని ఆయన ఎద్దేవా చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో బద్ధ శత్రువులైన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ లు మిలాఖత్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి కూటములు ఏర్పడటం ఉత్తరప్రదేశ్ కు కొత్తకాదన్న యోగీ, ఆ కూటమికి నాయకులెవరో ముందు చెప్పాలని ప్రశ్నించారు. అలాగే 2019 ఎన్నికల్లో ఖచ్చింగా తమ పార్టీల అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Similar News