ఒక్క వ్యాఖ్య నేతలను నిద్రలేకుండా చేస్తుందే ...?

Update: 2018-01-25 04:30 GMT

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బిజెపికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని వైసిపి అధినేత చేసిన వ్యాఖ్య ఏ పార్టీ వారికీ నిద్ర లేకుండా చేస్తుంది. ఆ సంచలన వ్యాఖ్య రేపిన దుమారం ఇంకా సమసిపోకుండానే బిజెపి శాసన సభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు పార్టీ మారిన వారు మంత్రులుగా కొనసాగడం ఏమిటంటూ వైసిపి కార్యాలయంలో కూర్చుని మరీ చేసిన వ్యాఖ్య సంచలనమే అయ్యింది. ఫిరాయింపులు చట్టబద్ధం చేస్తూ చట్టం చేసేయడమే మంచిదని చెప్పడం రాజకీయాలను బాగా హీటెక్కించింది. ఏపీ రాజకీయాలు ఎటు పోతున్నాయి. ఎవరు ఎవరితో జట్టు కడతారు. బిజెపి ఏమి చేయబోతుంది ? తదితర అంశాలు పొలిటికల్ సర్కిల్స్ నే కాదు సామాన్యుల్లోనూ ఆసక్తిగా మారిపోయాయి.

ఇది బిజెపి మార్క్ మైండ్ గేమ్ ?

అమరావతి లోని వైసిపి ఛాంబర్ లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మెన్ బుగ్గన రాజేంద్రప్రసాద్ తో కలిసి విష్ణుకుమార్ రాజు ఫిరాయింపులపై ఇలా స్పందించారో లేదో అలజడి పెద్దఎత్తునే బయల్దేరింది. ఆయనే మీడియా కు ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పడాన్ని బట్టి టిడిపి విష్ణుకుమార్ రాజుపై ఏ స్థాయిలో వత్తిడి తెచ్చిందో అన్న చర్చ సాగుతుంది. విష్ణు చేసిన కామెంట్స్ తెలియగానే టిడిపి వైపునుంచి బోండా ఉమా తొలిగా స్పందించి ఈ వ్యాఖ్యలు విష్ణుకుమార్ రాజు వ్యక్తిగతంగా చేసి ఉంటారని చెప్పిన వెంటనే అటునుంచి అదే స్పందన రాజు ఇవ్వడం విశేషం. దాంతో ఏపీ పాలిటిక్స్ ను తమ కంట్రోల్ లో పూర్తి స్థాయిలో పెట్టుకునేందుకు బిజెపి నాయకులు మైండ్ గేమ్ నేరుగా ప్రారంభించారన్నది స్పష్టం అవుతుంది. టిడిపి అధినేత దావోస్ లో పర్యటిస్తున్న క్రమంలో దీనిపై ఆయన స్పందన ఎలా వుండబోతుందా అన్న ఆసక్తి అందరిలో మొదలైంది. బిజెపికి ఫిరాయింపులు ఇప్పుడు గుర్తుకు రావడంపైనా గట్టిగానే విమర్శలు మొదలు అయ్యాయి. టిడిపి తమ మిత్రపక్షంతో ఇన్నాళ్లు ఆడుతున్న మైండ్ గేమ్ ఇప్పుడు ఆ పార్టీ తమపై ప్రయోగించడంతో కంగారు పడుతున్నారు తమ్ముళ్లు.

Similar News