తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ తప్ప అందరు కలిసిపోయారా ? అవుననే తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తెలుగు దేశం వైపు న రేవంత్ రెడ్డి దాదాపు లేకపోవడం, బిజెపి కేసీఆర్ సర్కారుకి సూచనలు సలహాలు, ప్రశంసలు అందించడం, ఎంఎంఐఎం ఇక టిఆర్ ఎస్ చేయాలిసిన దాడిని కాంగ్రెస్ పై స్వయంగా చేయడం గమనిస్తే అన్ని పార్టీలను కేసీఆర్ తన దారిలోకి తెచ్చుకున్నట్లే కనిపిస్తుంది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని సర్కార్ చక్కగా వినియోగించుకుంది.
అర్చకులు, బ్రాహ్మణ సమస్యలపై ...
అర్చకులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించే అంశంపై చర్చలో కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ మంచి ఆలోచనలతో తమ ప్రభుత్వంలాగే ముందుకు వెళుతుంటే ఆయనపై కూడా బురదజల్లుతున్నారని బిజెపి ని ప్రసన్నం చేసుకున్నారు. కిషన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఎంఐఎం నేత అసదుద్దీన్ పైనా ప్రశంసల జల్లు కురిపించారు. అలా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టారు గులాబీ బాస్. కాంగ్రెస్ పక్ష సభ్యుల నినాదాల హోరులో డిప్యూటీ స్పీకర్ సభను ప్రశ్నోత్తరాల వరకు నిర్వహించి వాయిదా వేశారు.
అసెంబ్లీ ముట్టడిని భగ్నం చేసిన పోలీసులు ...
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ముట్టడికి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు విజయవంతంగా భగ్నం చేశారు. ఒక రోజు ముందుగానే కాంగ్రెస్ శ్రేణులను హైదరాబాద్ చుట్టు పక్కల వున్న జిల్లాలో వున్నా కీలక నేతలను గృహనిర్బంధాలు, అరెస్ట్ లు చేసినా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి భారీగానే తమ అనుచరులతో సిటీలోకి వచ్చేయ గలిగారు. అసెంబ్లీ కి సమీపంలో వారిని పోలీసులు నిరోధించి అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తినా కొంత సేపటికి సద్దుమణిగాయి.
హరీష్ వెర్సెస్ ఉత్తమ్ ....
ప్రజా సమస్యలపై ఎన్నిరోజులైనా అసెంబ్లీని నిర్వహిస్తామని మా ప్రభుత్వం చెబుతుంది మరి ఎందుకు కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీకి ప్రజా సమస్యలు చర్చించి పరిష్కరించే ఆలోచనే లేదని ఆయన దాడి చేశారు. సాక్షాత్తు కాంగ్రెస్ నేత జానారెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం కూడా ఆ పార్టీకి ఇష్టం లేదని హరీష్ విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. అయితే ఈ విమర్శలను టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి తిప్పి కొట్టారు. తమను మాట్లాడనీయకుండా అసెంబ్లీని 50 రోజులు నిర్వహించి ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలపై సర్కార్ కి చిత్తశుద్ధి లేదని ఇచ్చిన హామీలు అమలు పరిచి ఆదుకోమంటే అప్రజాస్వామికంగా పోలీసులతో అరెస్ట్ లు చేయిస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు.