గల్లా జయదేవ్... ‘‘ఎవరికీ అందుబాటులో ఉండరు. నియోజకవర్గాన్ని పట్టించుకోరు. క్యాడర్ కు అందుబాటులోనే ఉండరు. ఎక్కువగా తిరుపతి, ఢిల్లీలోనే కాలం వెళ్లబుచ్చుతుంటారు.’’ ఇదీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పై సొంత పార్టీలోనే విన్పించిన విమర్శలు. కొందరైతే నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి సయితం గల్లా పనితీరును ముఖ్యమంత్రి వద్దనే ప్రస్తావించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సయితం గల్లా జయదేవ్ ను రెండు, మూడు సార్లు మందలించాల్సి వచ్చిందంటారు. ఎక్కువగా అందుబాటులో ఉండకుండా పీఏతోనే ఇక్కడ నడిపించడాన్ని టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఫిదా అయిన నేతలు....
కాని ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు గల్లా జయదేవ్ కేవలం గుంటూరు పార్లమెంటు పరిధిలోనే కాదు. పదమూడు జిల్లాల్లో ఆయన పేరుమారుమోగిపోతుంది. మూడు రోజుల క్రితం గల్లా జయదేవ్ పార్లమెంట్ లో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఆకట్టుకోవడమేకాదు రోమాలు నిక్కబొడుకునేలా సాగింది ఆయన ప్రసంగం. దీంతో ముఖ్యమంత్రి నేరుగా ఫోన్ చేసి గల్లాకు అభినందనలు తెలపడమే కాకుండా శభాష్ అని ప్రసంశించారు. అంతలా ఆకట్టుకుంది ఆయన ప్రసంగం. సూటిగా...స్పష్టంగా గల్లా జయదేవ్ సంధించిన ప్రశ్నలకు అధికారపక్షమైన బీజేపీ ఎంపీలు సయితం బిత్తరపోయారు.
గల్లాకు పెరిగిన ఫ్యాన్స్.....
మా అవసరం లేకుంటే... చెప్పండి...మేమే తప్పుకుంటాం... ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టిన గతే మీకు పడుతుందంటూ పంచ్ డైలాగులు వేసిన గల్లా జయదేవ్ కు ఇప్పుడు తెలుగు ప్రజలు ఫిదా అయిపోయారు. తెలుగుగోడి గళాన్ని ఢిల్లీలో బలంగా విన్పించారని గల్లాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కర లేదు. గల్లాకు అమాంతంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఇలా గల్లా జయదేవ్ నాలుగుగేళ్ల నుంచి తనపై వస్తున్న విమర్శలకు ఒక స్పీచ్ తో చెక్ పెట్టేశారు. ఇప్పుడు గుంటూరు జిల్లా తెలుగుదేశం క్యాడర్ కూడా గల్లాను కలుసుకుని ఆయనను అభినందించాలని ఉవ్విళ్లూరుతుంది. మొత్తం మీద గల్లా జయదేవ్ చేసిన ప్రసంగం ఐదుకోట్ల మంది ప్రజలను ఆకట్టుకుందనే చెప్పొచ్చు. ఈయన ఈరోజు గుంటూరు వస్తున్న సందర్భంగా పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.