ఇప్పుడు ఆర్కే లక్ష్మణ్ బొమ్మలు వేసే రోజులు కావు. ఆయన బతికివుంటే జైల్లో పెట్టేసేవారేమో..? ఏపీ తెలంగాణ లో సైతం రచయితలు కార్టూనిస్ట్ లు సోషల్ మీడియా వారిపై అరెస్టులపర్వం సాగడం తెలిసిందే . ఇప్పుడు ప్రఖ్యాత ఫ్రీ లాన్స్ కార్టూనిస్ట్ అయిన తమిళనాడు కు చెందిన బాలా వంతు వచ్చింది. కార్టూనిస్ట్ బాలా వేసిన కార్టూన్ ఆయన్ను అరెస్ట్ అయ్యేలా చేసింది. ఆయన గీసిన బొమ్మతో ఇమేజ్ దెబ్బతిని ఢీలా పడి సర్కార్ ప్రతీకారేచ్చతో ఈ చర్యకు పాల్పడటం తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనమే అయ్యింది. ఇంతకీ పత్రికాస్వేచ్ఛకు సంకెళ్లు అక్కడ ఎందుకు పడ్డాయి ..?
అసలు బొమ్మేం చెప్పింది ....?
బాలా 15 రోజుల క్రితం తిరునల్వేలిలో ఒక దారుణం చోటుచేసుకుంది. ఒక కుటుంబం వడ్డీల వేధింపులు భరించలేక కలక్టరేట్ ఎదుట తమ ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడటం దేశవ్యాప్త సంచలనమే అయ్యింది. నిప్పు అంటించుకుని వారంతా చనిపోయారు. ఈ ఘోరం పై బాలా తనదైన శైలిలో కార్టూన్ సంధించారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి పళని స్వామి నగ్నంగా నిలబడి ఆ శవాల దగ్గర సిగ్గు లేకుండా చలికాగుతున్న తీరులో తన కుంచె కదిలించారు. ఆ కార్టూన్ పెద్ద సంచలనమే అయ్యింది. దానికి ఫేస్ బుక్ లో 40 వేలకు పైగా షేర్లు , 65 వేలమందికి పైగా లైకులు కొట్టడంతో ప్రభుత్వాన్ని లాగి పెట్టి గూబమీద కొట్టినట్లు నెటిజెన్లు స్పందించారు. దాంతో ప్రభుత్వం వున్న సిగ్గు కూడా విడిచిపెట్టి నిస్సిగ్గుగా బాలా పై కేసుపెట్టి లోపల వేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 67 కింద ఐపీసీ కిందా కేసులు నమోదు చేసి ప్రతీకారానికి పాల్పడి మరో తప్పు చేసింది. తమిళ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తీవ్ర విమర్శల పాలు అయ్యింది. బాలా కు మద్దత్తుగా దేశవ్యాప్తంగా మీడియా , ప్రజాసంఘాలు, నెటిజెన్లు నిలిచి పోరాటం మొదలు పెట్టారు. అసలే అనేక సమస్యల్లో కొట్టు మిట్టాడుతున్న ఫళని ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చిపడింది.