పార్లమెంట్ లో జై ఆంధ్రా అంటూ లోక్ సభలో కవిత మద్దతు ప్రకటించడంతో ఒక దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టారు ఆమె. తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ లో వున్న ఆంధ్ర సెటిలర్స్ మనసు దోచేశారు. అదే విధంగా విభజన సమయంలో టిఆర్ ఎస్ తిట్టిన తిట్లతో గాయపడ్డ ఎపి వాసులను ఆ గాయాలు కు లేపనం పూశారు. రాబోయేవి ఎన్నికలు. కీలకమైన ఈ తరుణంలో ప్రతి ఓటు కీలకమే. ఈ నేపథ్యంలో ఏపీ పార్లమెంట్ సభ్యుల పోరాటానికి తనవంతు మద్దతును ప్రకటించారు ఆమె. అంతే కాదు కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు కవిత. గత ప్రభుత్వాలు చేసే వాటిని తరువాత వచ్చే వారు అమలు చేయకపోతే తప్పుడు సంకేతాలు దేశ ప్రజలకు వెళతాయని హెచ్చరిక సైతం చేశారు. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ఎందుకు చిత్తశుద్ధితో అమలు చేసి ఇరు రాష్ట్రాలకు న్యాయం చేయడం లేదని కవిత చేసిన ప్రసంగానికి అంతా హర్షం వ్యక్తం చేశారు.
తండ్రికి తగ్గ తనయే ...
తన వాగ్దాటితో ఒక సుదీర్ఘ ఉద్యమాన్ని నిర్మించారు కేసీఆర్. తన వాడి వేడి చర్యలతో ప్రత్యర్థులకు అందని వ్యూహాలతో తెలంగాణ సాధించి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆయన వారసులుగా తనయుడు కేటీఆర్, కుమార్తె కవిత ప్రజలనుంచి ఎన్నికయ్యారు. ఉద్యమ సమయంలో వారిద్దరూ సైతం చురుకైన పాత్రే పోషించారు. కేటీఆర్ ఎమ్యెల్యేగా ఎన్నికయ్యి మంత్రిగా రాణిస్తున్నారు, కవిత ఎంపీగా ఎన్నికయ్యి గులాబీ దళానికి పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తూ తనదైన శైలిలో రాణిస్తున్నారు. ఆమె ఆకట్టుకునే ప్రసంగాలు చేయడంలో దిట్ట గా మారారు. తండ్రి కేసీఆర్ రూట్ లోనే కవిత దూసుకుపోవడం కారు పార్టీ ప్రయోజనాలు ఎప్పటికప్పుడు కాపాడుతూ సాగడం గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతుంది.