ఏపీ రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర విభజన చేశారని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో నామరూపాలు లేకుండా పోయింది. ప్రస్తుతం జరుగుతున్న రాజీకీయ పరిణామాలను నిశితంగా గమనించి అధిష్టానం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు ఏపీసీసీ నేతలు ఏఐసీసీ రాహుల్ గాంధీని కలిసి తమ ఆలోచనను చెప్పారు. అవిశ్వాసానికి వైసీపీ కూడా మద్దతు ఇప్పటికే ప్రకటించిందని తెలిపారు. బీజేపీతో పాటు అధికార టీడీపీని కూడా ఇరుకున పెట్టేందుకు అవిశ్వాసం ఉపయోగపడుతుందన్నది కాంగ్రెస్ వ్యూహంగా కన్పిస్తుంది.
చంద్రబాబుకు ఇబ్బందే....
టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రం విషయంలో ఇప్పటి వరకూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మార్చి 5వ తేదీన డెడ్ లైన్ గా పెట్టుకున్నారు. ఏపీకి న్యాయం జరగకుంటే పార్లమెంటు సాక్షిగా పోరాడతామని ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. ప్రతిరోజూ చంద్రబాబు టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ తమ పార్లమెంటు సభ్యులు రాజీనామాచేస్తారని ప్రకటించిన తర్వాత టీడీపీ మరింత డిఫెన్స్ లో పడిపోయింది. తొలుత కేంద్రమంత్రులు వైదొలగాలని నిర్ణయించుకుంది. తర్వాత దశలవారీగా రాజీనామాలు చేయాలని నిర్ణయించింది.
బీజేపీ వ్యూహమేంటి?
అయితే టీడీపీ వ్యూహానికి విరుగుడుగా ఏపీ కాంగ్రెస్ నేతలు అవిశ్వాసం వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. ఒక దెబ్బకు రెండు పిట్టలన్న సామెతగా కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని యోచిస్తోంది. ఈ అవిశ్వాసానికి మద్దతిస్తే ఒక తంటా...? ఇవ్వకపోతే మరొక తంటా? అన్నది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారబోతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు, ఇటు రాష్ట్రంలో ఉన్న టీడీపీ అసలు రూపాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్న యోచనలో ఏపీ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మరి ఇది ఎంతవరకూ సాధ్యమవుతుంది? ఒకవేళ నిజంగా అవిశ్వాసం పెడితే టీడీపీ పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే ఒకవేళ కాంగ్రెస్ అవిశ్వాసం పెడితే బీజేపీ వ్యూహమేంటన్నది చర్చనీయాంశమైంది.