విభజన హామీలను కేంద్రం గౌరవించలేదని, తాను అభిమానించే నేతల్లో జేపీ ఒకరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణతో పవన్ భేటీ ముగిసింది. జేపీ అంటే తనకు గౌరవమన్నారు పవన్ విజభన సమయంలో జేపీ ఎంతో అధ్యయనంచేశారని, అన్ని పార్టీలతో కలుపుకుని విభజన హామీల అమలుకోసం పోరాడతామని పవన్ చెప్పారు. దీనికోసం మేధావులు, అన్ని రాజకీయ పార్టీల నేతలతో చర్చిస్తామన్నారు. విభజన సమస్యలు, హామీలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత తమ కార్యక్రమాన్ని రూపొందించుకుంటామని చెప్పారు. అలాగే జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ లక్షలాది మంది అభిమానులున్న పవన్ కల్యాణ్ కోరి కష్టాలు తెచ్చుకున్నారన్నారు. పవన్ పోరాటానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఒకసారి చట్టంలో పెట్టాక ఏరు తాగాక తెప్ప తగిలేయడం వంటిది ప్రమాదకరమైన పరిణామని జేపీ అభిప్రాయపడ్డారు.
కలిసి వచ్చే అన్ని పార్టీలతో.....
అన్ని రకాల చర్చలు, రభస జరిగాక రాతపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాత హామీలు ఎందుకు అమలు చేయలేరని జేపీ ప్రశ్నించారు. ఏపీ కి ఆర్థిక మైన అంశాల్లోనూ, అభివృద్ధి లోనూ న్యాయం జరగాలన్నది తమ కోరికన్నారు. తెలంగాణకూ కూడా న్యాయం జరగాలన్నారు. అన్నీ సమీక్షించుకు న్నామన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో, సంస్థకో సంబంధించిన సమస్య కాదని ఏపీ, తెలంగాణ ప్రజల సమస్య అని జేపీ అన్నారు. ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత ఎందుకు అమలుపర్చడం లేదన్నారు. ఏపీకి న్యాయం చేయలేదనడానికి తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయన్నారు. ఇందులో రాజకీయాలకు తావుండదన్నారు. తెలుగు ప్రజల ఐకమత్యాన్ని కాపాడుతూ... దేశసమైక్యతను కొనసాగిస్తూ చట్టబద్ధంగా పోరాటం చేయాలన్నదే తమ ఉద్దేశ్యమని జేపీ వివరించారు. జాతీయ స్థాయిలో పోరాటం చేస్తే కాని అనుకున్నది సాధించలేమన్నారు. త్వరలోనే అన్ని పార్టీల నేతలతో సమావేశమై ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతామని పవన్, జేపీలు చెప్పారు. అందరూ ఐక్యంగా పోరాటం చేసినప్పుడే తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగుతుందని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలనూ కలిసి ఏపీ, తెలంగాణలకు జరిగిన అన్యాయంపై వివరించనున్నట్లు వారు తెలిపారు. మొత్తం మీద ఏపీ విభజన హామీల అమలుకు జేఏసీ ఏర్పాటుకోసం పవన్ ఒక అడుగు ముందుకేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ తో కూడా ఈ నెల 11వ తేదీన పవన్ భేటీ కానున్నారు.