ఐలయ్యపై యుద్ధం తీవ్రం చేసిన వైశ్యులు

Update: 2017-10-09 05:30 GMT

ధర్నాలు , రాస్తారోకోలు , దిష్టిబొమ్మల దహనం , టివి షోల్లో మాటల తూటాలు పేలుస్తూ వచ్చిన ఆర్యవైశ్యులు ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు . హైదరాబాద్ లోని ఐలయ్య ఇంటి వద్ద ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి అంబర్ పేట పోలీస్ స్టేషన్ కి తరలించారు . దాంతో ఈ వివాదాం మరింత ముదిరిపోతోంది . ఆర్య వైశ్యుల తాజా ప్రతిఘటనను ఐలయ్య సీరియస్ గా తీసుకున్నారు . తాను వారి డిమాండ్ కి తలొగ్గి సామాజిక స్మగ్లర్ లు కోమటోళ్లు టైటిల్ మార్చే పనే లేదన్నారు . ముందు ఆర్య అనే పదాన్ని వారు తొలగించాలని డిమాండ్ చేశారు .ఐలయ్య ఇంటి ముందు టి సర్కార్ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది.

మరిన్ని పదునైన వ్యాఖ్యలు చేసిన ఐలయ్య ...

తన పుస్తకం టైటిల్ మార్చమనే హక్కు పుస్తకాలు చింపి పొట్లాలు కట్టుకునే వారికి లేదని ఘాటు విమర్శలు చేశారు ఐలయ్య . తాను మేధావినని పుస్తకాలు రాస్తూనే ఉంటానని పుస్తకాలు రాసే మేధావులతో ఈ అంశంపై చర్చకు సిద్ధమన్నారు. ఈ వివాదంలోకి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను మరోసారి లాగారు ప్రొఫెసర్ ఐలయ్య . షా వైశ్యుల పక్షాన చర్చకు సిద్ధం కావాలన్నారు. తన పుస్తకం టైటిల్ పై న్యాయస్థానం చూసుకుంటుందని వ్యాఖ్యానించారు . ఒక ప్రొఫెసర్ గా తాను అధ్యయనం చేసి పుస్తక రూపంలో ప్రచురించడం తప్పేలా అవుతుందని ఆయన ప్రశ్నలు సంధించారు . ఇలా అటు ఐలయ్య ఇటు ఆర్య వైశ్యులు ఏ ఒక్కరు వెనక్కి తగ్గకపోవడంతో అన్ని సామాజిక వర్గాలు ఈ అంశంపై ఆసక్తిగా ఏమి జరగబోతుందా అని ఎదురు చూస్తున్నాయి .

Similar News