వారిద్దరూ మాములోళ్ళు కాదు. వాళ్ళ డైలాగ్స్ అగ్గిపుల్ల లేకుండా నిప్పు రాజేసేలా ఉంటాయి . దేన్నీ లెక్క చేయని మనస్తత్వం వున్న ఇద్దరు ఒకే వేదిక ఎక్కితే ఏమౌతుంది ..? మరో కొత్త వివాదానికి దారితీస్తుంది . వారెవరో కాదు ఒకరు ఏలూరు లోక్ సభ సభ్యుడు మాగంటి బాబు, మరొకరు రాజ్యసభ సభ్యుడు టీజె వెంకటేష్. వీరిద్దరి సామాజిక వర్గాలు వేరు వేరు అయినా ఐలయ్య వ్యాఖ్యలు వీరిని ఏలూరు లో ఒకేవేదికమీదకు చేర్చేలా చేశాయి. దాంతో ఒకరిని మించి మరొకరు తూటాల్లాంటి మాటలతో ఐలయ్యను ఏకిపారేశారు.
కాళ్ళు చేతులు విరగొట్టండి ...
ఈ మాటలు అన్నది సాక్షాత్తు లోక్ సభ సభ్యులు మాగంటి బాబు. రాబోయే కాలం ఎన్నికల సీజన్ కావడంతో రెండు మూడు కులాల ఓట్లు పక్కాగా చిక్కాలంటే ఇలాంటి వివాదాలు ఒకటి రెండు ఉంటే చాలు రాజకీయనాయకులకు ఎక్కువ శ్రమ లేకుండా ఆ ఓటు బ్యాంక్ తమవైపు లాగేసుకుంటారు నేతలు. మాగంటి బాబు అదే చేశారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో వైశ్య ఓటర్లు బాగానే వున్నారు . బాబు ఈ అవకాశాన్ని అప్పుడే సద్వినియోగం చేసుకోవడం షూరూ చేసేసారు.
ఇక వెంకటేష్ ఎక్కడా తగ్గలేదు ...
కర్నూలు ఫైర్ బ్రాండ్ రాజ్యసభ సభ్యుడు టీజె వెంకటేష్ కోసం ఎంత చెప్పినా తక్కువే . రాష్ట్ర విభజన సమయంలో కుండ బద్దలు కొట్టి మరి చెబుతున్నా "విడిపోమని" అనే మాట సింబాలిక్ గా మట్టికుండ తెప్పించుకు మరి దాన్ని బద్దలు కొట్టి చూపించి చెప్పారు వెంకటేష్. ఎప్పుడైతే ప్రొఫెసర్ కంచె ఐలయ్య కోమటోళ్లు సామాజిక స్మగ్లర్ల పుస్తకం విడుదల చేశారో ఆరోజు నుంచి టీజె నిద్రపోతే ఒట్టు. ఎంపీ పదవిలో వున్నా సొంత కులం ఆత్మాభిమానం దెబ్బతినే లా ఐలయ్య చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టడంలో చెలరేగిపోతున్నారు వెంకటేష్. తాజాగా ఏలూరు లోను ఘాటు వ్యాఖ్యలే చేశారు ఎంపీ.
ఐలయ్య మాత్రం .....
మరి ప్రొఫెసర్ ఐలయ్య ఏమన్నా తక్కువ తిన్నారా ..? ఏ వేదిక దొరికితే ఆ వేదికమీదకు ఎక్కి తన వాదనలో కానీ చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా తగ్గడం లేదు సరికదా మరింత ఫైర్ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అగ్గి రాజేసిన ఈ వ్యవహారంపై వైశ్యులు ధర్నాలు, దిష్టిబొమ్మల దహనం , రాస్తారోకోలు ముమ్మరంగానే కొనసాగుతున్నాయి . ఇక సామాజిక మాధ్యమాల్లో ఈ వ్యవహారంపై ఎవరు ఏ పోస్ట్ పెట్టినా రచ్చ రచ్చ అయిపోతుంది. మొత్తానికి ఈ వివాదానికి ఎప్పుడు ముగింపు ఉంటుందా అని అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.