సామాజిక స్మగ్లర్లు... కోమటోళ్లు పుస్తకాన్ని రచించిన వివాదాస్పద పుస్తక రచయిత ప్రొఫెసర్ కంచె ఐలయ్య కు విజయవాడలో సన్మానం ఏపీ పోలీసులను టెన్షన్ పెడుతుంది . ఐలయ్య సన్మానం ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని ఆర్యవైశ్యులు, బ్రాహ్మణ సంఘాల హెచ్చరికలతో సర్కార్ అలెర్ట్ అయ్యి అసలు రెండు లేకుండా చేద్దామని డిసైడ్ అయ్యింది. ఏపీ పోలీస్ బాస్ సాంబశివరావు ఐలయ్య విజయవాడలో అడుగు పెడితే అరెస్ట్ తప్పదని ఇప్పటికే హెచ్చరించారు. ఇప్పటికే బెజవాడలో 144 సెక్షన్ విధించారు. ఐలయ్య అనుకూల ప్రతికూల కార్యక్రమాలకు అనుమతులు లేవని తేల్చి చెప్పారు. కులాలు మతాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేస్తామని తుని లో రైలు దహనం వంటివి పునరావృతం కాకుండానే ఈ చర్యలన్నారు డిజిపి.
ఇంటి చుట్టూ మోహరించిన పోలీసులు ...
ఏపీ పోలీసులు ఐలయ్య సత్కార సభకు అనుమతి లేదంటూ ప్రొఫెసర్ కి నోటీసులు అందజేశారు. హైదరాబాద్ లోని తార్నాక లో ఐలయ్య ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఆయన ఇంటినుంచి బయటకు వస్తే రేపు అరెస్ట్ చేసే వ్యూహంలో ఖాకీలు సిద్ధంగా వున్నారు. దాంతో ఐలయ్య ఇంటి పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొనివుంది.
టీమాస్ తో చర్చించాకే నిర్ణయం ...
తెలంగాణ టి మాస్ తో చర్చించాకే విజయవాడ కార్యక్రమానికి వెళ్ళాలా లేదా అన్నది తెలుస్తా అని ఐలయ్య ప్రకటించారు. ఏపీ పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తోందని మండిపడ్డారు. మరోవైపు ఆర్య వైశ్య బ్రాహ్మణ సంఘాలు ఐలయ్యకు వ్యతిరేకంగా ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా సభ జరిపి తీరుతామని ప్రకటించాయి. వ్యవహారం ఉద్రిక్తంగా మారుతున్న తరుణంలో ఏపీ సర్కార్ ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వ సాయాన్ని కూడా అర్ధించడం విశేషం.