ఐఏఎస్ వర్సెస్ వైసీపీ

Update: 2018-02-23 00:30 GMT

ఐఎఎస్ లపై రాజకీయ పార్టీలు విరుచుకుపడటం ఇటీవల కాలంలో సర్వ సాధారణమయింది. పబ్లిక్ సర్వెంట్ గా పేరొందిన ఐఏఎస్ లు ప్రభుత్వం చెప్పినట్లు నడచుకుంటున్నారన్నది ఎప్పటి నుంచో విన్పిస్తున్న వాదన. అయితే తాజాగా ఏపీలో ఐఏఎస్ అధికారులపై వైసీపీ చేసిన ఆరోపణలు రాజకీయంగా పెను దుమారాన్నే రేపాయి. పాలన వ్యవహారాలు మాత్రమే కాదు, రాజకీయాల్లో ఐఏఎస్, ఐపీఎస్ ల జోక్యం పెరిగిందన్నది వైసీపీ ఆరోపణ. ఈ ఆరోపణ చేసింది సాక్షాత్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. పార్టీ ఫిరాయింపుల్లో ఐఏఎస్ లే ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్లలో....

తమ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలులో ఐఏఎస్ అధికారులు సతీష్ చంద్ర, చంద్రమౌళి, సాయిప్రసాద్ లతో పాటు ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు పాత్ర కూడా ఉందని విజయసాయి రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయన్నారు విజయసాయి. టీడీపీ నేతలు కళావెంకట్రావు, అచ్చెన్నాయుడు, టీజీ వెంకటేశ్ లకు వీరు ఎమ్మెల్యేల కొనుగోళ్లలో సహకరిస్తున్నారని తీవ్ర ఆరో్పణలు చేశారు. ఐఏఎస్ లు టీడీపీ నాయకులతో కలిసి పనిచేయడమేంటని ఆయన ప్రశ్నించారు. తమ వద్ద ఆధారాలున్నాయని, అందుకే వారిపై ఆరోపణలు చేశామని చెప్పారు విజయసాయి రెడ్డి.

ఐఏఎస్ ల అభ్యంతరం.....

అయితే విజయసాయి రెడ్డి ఆరోపణలను ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. అమరావతికి రాజధాని తరలి వచ్చిన తర్వాత ఐఏఎస్ లు పాలనను గాడిలో పెట్టడానికి ఎంతో కష్టపడుతున్నారని, విధినిర్వహణలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న ఐఏఎస్ లను రాజకీయాల్లోకి లాగడం తగదని ఐఏఎస్ అధికారుల సంఘం కోరింది. దీనిపై ఐఏఎస్ అధికారుల సంఘం ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజాసంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్న తమను అవమానించడం సరికాదని ఐఏఎస్ అధికారుల సంఘం హెచ్చరించింది. మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో ఐఏఎస్ లు చిక్కుకుని పోయారన్నది వాస్తవం. రాజకీయ పార్టీల విమర్శలు ఎలా ఉన్నా.... ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుంటూ... నిబంధనలకు విరుద్ధంగా కొందరు పనిచేస్తున్నారన్నది ఐఏఎస్ ల విషయంలో గతంలో అనేక సంఘటనలు స్పష్టం చేశాయి. నిన్న మొన్నటి వరకూ రాజకీయ పక్షాల మధ్య నడిచే మాటల యుద్ధంలో ఇప్పుడు ఐఏఎస్ అధికారులు కూడా చిక్కుకున్నారు.

Similar News