ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఏమయింది? ఆయన ఎందుకు పశ్చాత్తాప పడుతున్నారు. ఘాటుగా, సూటిగా విమర్శలు చేసే కేజ్రీవాల్ ఇప్పుడు క్షమాపణల బాట పట్టారు. వరుసగా కేసులు, లేని పోని సమస్యలు ఎందుకు అనుకున్నారో ఏమో ఢిల్లీ ముఖ్యమంత్రి సారీ ల పరంపరను ఆపలేదు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణలు చెప్పే కార్యక్రమాన్ని ఇంకా ఆపలేదు. గత కొద్ది రోజులుగా కేజ్రీవాల్ ఇదే పనిలో ఉన్నారు. అయితే ఈ క్షమాపణలు ఎంతవరకూ పనిచేస్తాయన్నది పక్కన పెడితే కోర్టుల చుట్టూ తిరగలేకే కేజ్రీవాల్ ‘‘ఐ యామ్ సారి’’ అనే పదాన్ని పదే పదే వాడుతున్నారు.
వరుసగా క్షమాపణలు...
కొంతకాలం క్రితం పంజాబ్ నేత బిక్రం సింగ్ కు తొలుత అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణ చెప్పారు. ప్రత్యేకంగా క్షమాపణ లేఖలు రాస్తున్నారు. పంజాబ్ ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ క్షమాపణ చెప్పారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భగవంత్ మాన్ తన పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ లోని డ్రగ్స్ రాకెట్ లో శిరోమణి అకాళీదళ్ నేత బిక్రంసింగ్ హస్తం ఉందని కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. దీనిపై బిక్రం సింగ్ పరువు నష్టం దావా వేశారు. అయితే తాము డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే అకాళీదళ్ నేతకు ఎలా క్షమాపణ చెబుతారంటూ మాన్ రాజీనామా చేశారు. అయినా కేజ్రీవాల్ పెద్దగా పట్టించుకోలేదు.
దాదాపు 30కిపైగా కేసులు....
కేజ్రీవాల్ పై దాదాపు 30పరువు నష్టం కేసులు వివిధ కోర్టుల్లో ఉన్నాయి. వాటి విచారణకు కేజ్రీవాల్ హాజరుకావాల్సి వస్తోంది. దీంతో కోర్టు కేసులతో విసిగిపోయిన కేజ్రీవాల్ తాను గతంలో ఆరోపణలు చేసిన బీజేపీ, కాంగ్రెస్ నేతలకు వరుసగా సారీలు చెబుతూ వస్తున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, బీజేపీ పార్లమెంటు సభ్యులు రమేష్ బిదూరికి కూడా క్షమాపణలు చెప్పారు. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రికి అరుణ్ జైట్లీకి కూడా కేజ్రీవాల్ క్షమాపణ లేఖ రాయనున్నారు. అయితే ఇప్పటికే అరుణ్ జైట్లీ కేజ్రీవాల్ పై పరువునష్టం కేసు వేశారు. అది నడుస్తోంది. పరువు నష్టం కింద తనకు పది కోట్లు తనకు చెల్లించాలంటూ జైట్లీ దావా వేశారు. మరి జైట్లీ కేజ్రీవాల్ క్షమాపణ లేఖకు ఎలా స్పందిస్తారో చూడాలి.