అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన నేత టీటీవీ దినకరన్ కొత్త పార్టీని ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న రోజే ఆయన కొత్త పార్టీని ప్రకటించడం విశేషం. దినకరన్ కొత్త పార్టీ పేరు ‘‘అమ్మ మక్కల్ మున్నేట కళగం’’. పార్టీ జెండాను కూడా దినకరన్ ఆవిష్కరించడం విశేషం. నలుపు, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండే జెండాను ఆయన తన పార్టీ కోసం ఎంపిక చేసుకున్నారు. టీటీవీ దినకరన్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు. ఆయనతో పాటు శశికళ ను కూడా అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు.
స్థానికసంస్థల నేపథ్యంలోనేనా?
ఈ నేపథ్యంలో తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలపాలంటే పార్టీని పెట్టాల్సిన అవసరం ఉంది. లేకుంటే క్యాడర్ ఛిన్నాభిన్నమై పోతోంది. అందుకోసమే దినకరన్ హడావిడిగా పార్టీ ప్రకటన చేశారంటున్నారు. ఇటీవలే దినకరన్ ఆర్కే నగర్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. భారీ మెజారిటీని సాధించారు. డీఎంకేకు డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో దినకరన్ తమకు ప్రజల అండ పుష్కలంగా ఉందని భావిస్తున్నారు.
సొంతగూటిలోనే వ్యతిరేకం....
దినకరన్ సొంతంగా పార్టీ పెట్టాలంటే ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలే వ్యతిరేకించారు. దీంతో ఆయన వెనక్కు తగ్గారు. అన్నాడీఎంకే గుర్తు, పార్టీని స్వాధీనం చేసుకోవడానికి ఒకవైపు న్యాయపోరాటం చేస్తున్నారు. అయితే స్థానిక సంస్థలు వస్తుండటంతో తమకంటూ ఒక పార్టీ ఉండాలని దినకరన్ భావించారు. ఈ మేరకు పరప్పణ అగ్రహార జైలులో ఉన్న శశికళను, తనవెంట ఉన్న ఎమ్మెల్యలను ఒప్పించారు. తమకంటూ ఒక పార్టీ లేకుంటే క్యాడర్ వెంట నడవదని, అన్నాడీఎంకే కోసం న్యాయపోరాటం చేస్తూనే లోకల్ ఎలక్షన్స్ కోసం ఈ పార్టీని వినియోగించుకుందామని ఆయన సర్దిచెప్పారు.
అమ్మ పేరుతోనే....
అయితే పార్టీ పేరులో దివంగత జయలలిత గుర్తు వచ్చేలా దినకరన్ జాగ్రత్త పడ్డారు. అమ్మ అని వచ్చేలా జాగ్రత్త పడ్డారు. ముఖ్యమంత్రి జయలలిత తమిళనాడులో చెరగని ముద్ర వేసిన సంగతి తెలిసిందే. జయలలిత ప్రవేశపెట్టిన అనేక పథకాలు జనంలో నేటికీ గుర్తుండిపోతాయి. అలాగే జయ అమలు చేసిన అనేక పథకాలను ఇతర రాష్ట్రాలూ అనుసరించాయి. దీంతో జయకు ఇప్పటికీ చెక్కుచెదరని ఓటు బ్యాంకు ఉందని గుర్తించిన దినకరన్ అమ్మ పేరుతో పార్టీ పెట్టారు. అయితే జయలలిత బతికున్నంత కాలం దినకరన్ ను పోయెస్ గార్డెన్ వైపు గాని, అన్నాడీఎంకే కార్యాలయం వైపు గాని రానివ్వలేదన్న విషయాన్ని ప్రత్యర్థులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. జయ మరణం తర్వాత తమిళనాడులో కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల సినీనటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ అనే పార్టీని ప్రారంభించారు. రజనీకాంత్ పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నారు. అలాగే దినకరన్ కూడా కొత్త పార్టీ పెట్టడంతో తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో చాలా ఎక్కువగా ఉండే అవకాశం కన్పిస్తుంది. ఎన్నికల లోపు మరిన్ని పార్టీలు వచ్చే అవకాశమూ లేకపోలేదు.
కొ