పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ ప్రారంభం కావడంతో ఏపీలో పొలిటికల్ హీట్ వేసవితో బాటు మొదలైపోయింది. గత రెండువారాలుగా విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశం పై రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ఉద్యమం ఇప్పుడు మరింత తీవ్రం అయ్యింది. అన్ని పార్టీలు ప్రజా సంఘాలు ఉద్యమ బాటలోనే ఉంటున్నాయి. ఎవరికి వారే యమునాతీరే లా తమ పార్టీ మైలేజ్ ప్రధానంగా చూసుకుంటూ ఆందోళనలు చేస్తున్నా అందరి లక్ష్యం కేంద్రం హామీలు అమలు చేయాలన్నదే. ఈ నేపథ్యంలో అంతా సంప్రదాయ మీడియా, సామాజిక మాధ్యమాల్లో ఏపీ అన్యాయంపై ఎలుగెత్తి చాటుతున్నారు.
ఢిల్లీ లో వినే నాధుడే లేరు ...
ఏపీలో వివిధ రాజకీయపక్షాలు, ప్రజా సంఘాలు ఉద్యమాలు 13 జిల్లాలలో ఎక్కడో ఒక చోట చేస్తున్నా ఢిల్లీ వరకు ఆ సెగలు చేరుకోలేదు. కేంద్రంలోని అధికార విపక్ష పార్టీలు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల గోల లో తలమునకలు కావడంతో ఎపి ప్రజల గొంతు హస్తిన పెద్దలకు వినపడలేదు. జాతీయ మీడియా సైతం పార్లమెంట్ సమావేశాల్లో తప్ప ఆ తరువాత ఎపి ప్రజల గొంతు విప్పి చెప్పే ప్రయత్నం చేయలేకపోవడంతో ఆంధ్రుల ఆందోళన సరిహద్దు దాటని పరిస్థితి ఎదురైంది. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావడం, పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ మొదలు కావడంతో ఇప్పుడు ఏపీ ఆందోళనలపై జాతీయ మీడియా దృష్టి పెట్టింది. దేశంలోని విపక్షాలు ఏపీకి బాసటగా నిలిచేందుకు ఇప్పుడు మరోసారి సిద్ధం అయ్యాయి.
రగులుతున్న 13 జిల్లాలు ....
పార్టీలు ఏవి అయినా ప్రజా సంఘాలు ఎవరైనా అందరు ప్రత్యేక హోదా అంశాన్ని ఆందోళనల రూపంలో 13 జిల్లాలో వినిపిస్తున్నారు. విశాఖలో కమ్యూనిస్ట్ లు ప్రజా సంఘాలు పెద్దఎత్తునే ఉద్యమించాయి. కాగడాల ప్రదర్శన వంటి కార్యక్రమాలతో నిరసన గళం వినిపించాయి. విజయవాడలో హోదా ఇచ్చి తీరాలంటూ కేంద్రం వైఖరిపై ప్రజాసంఘాలు పార్టీలకతీతంగా రోడ్డెక్కాయి. ఇక అనంతపురంలో విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ పలువురు సెల్ టవర్లు ఎక్కి నిరసన తెలిపారు. వైసిపి ఇప్పటికే జిల్లాకలెక్టరేట్ ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టగా, చెన్నై వంటి చోట్ల టిడిపి ఐటి వింగ్ ధర్నాలు నిర్వహించింది. పలు నగరాలు, పట్టణాల్లో అఖిలపక్షాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ఛానెల్స్ చర్చా వేదికలు జోరుగా సాగుతున్నాయి.