ఏపీలో బీజేపీ అసలు ప్లాన్ ఇదేనా?

Update: 2018-02-19 10:30 GMT

బీజేపీ జాతీయ పార్టీ. అంటే.. విశాల భావాలు ఉన్న పార్టీ అని కూడా అర్ధం చేసుకోవ‌చ్చు- అన్నారు ప్రధాని హోదా లో వాజ్‌పేయి. అయితే, ఇప్పుడు ఆ విశాల భావాలే.. వికృత భావాలుగా మారుతున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. పెళ్లి ఒక‌రితో.. కాపురం మ‌రొక‌రితో అన్నట్టుగా బీజేపీ ఏపీలో పావులు క‌దిపేందుకు రెడీ అవుతోంద‌ని అంటున్నాయి ఢిల్లీ వ‌ర్గాలు. విష‌యంలోకి వెళ్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ గెలిచి.. తిరిగి ఢిల్లీ పీఠాన్ని ద‌క్కించుకోవాల‌ని ప్రధాని న‌రేంద్ర మోడీ భారీ ఎత్తున ప్లాన్ చేసుకున్నారు. దీనికి గాను ఆయ‌న ఇప్పటికే ఓ మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఆయ‌న ప్రవేశ పెట్టిన కొన్ని ప‌థ‌కాల కార‌ణంగా బీజేపీ ప‌రిస్థితి ఎటు పోయి ఎటు వ‌స్తుందో అనే జంకు మాత్రం పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స‌హా మిగిలిన నేత‌ల‌కు కూడా ఉంద‌ని తెలుస్తోంది.

క్రమంగా తగ్గుతున్న మోడీ గ్రాఫ్.....

అంటే.. 2014కు ముందు ఉన్న ఊపు, ఉత్సాహం, మోడీ ప్రభావం వంటివి ఇప్పుడు చాలా వరకు త‌గ్గాయ‌ని బీజేపీ అధిష్టానంలోని నేత‌లు కూడా గ్రహించారు. అదేస‌మ‌యంలో కూలిపోతుంద‌ని భావించిన కాంగ్రెస్ మ‌ళ్లీ చిగిరిస్తుండ‌టం క‌మ‌ల నాధుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు మిత్రప‌క్షాల అండ త‌ప్పనిసరి అని నేత‌లు గుర్తించారు. నిన్న మొన్నటి వ‌ర‌కు మోనార్క్‌లా ముందుకు వెళ్లిన మోడీ ఇప్పుడు త‌న గ్రాఫ్ క్రమ‌క్రమంగా తగ్గుతూ ఉండ‌డంతో పాటు ప‌ట్టున్న రాజ‌స్థాన్ లాంటి రాష్ట్రాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోనూ సిట్టింగ్ సీట్లు కోల్పోవ‌డంతో పూర్తిగా డౌన్ అయిపోతున్నాన‌న్న విష‌యం తెలుసుకున్నారు.

కర్ణాటకలోనూ అంత ఈజీకాదు....

ఇక ప్రస్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతోన్న రాష్ట్రాల‌తో పాటు క‌ర్నాట‌క‌లోనూ సానుకూల ఫ‌లితాలు వ‌చ్చే ఛాన్సులు అయితే క‌న‌ప‌డ‌డం లేదు. ఈ క్రమంలోనే ఏపీ వంటి కీల‌క రాష్ట్రం విష‌యంలో ఎలా వ్యవ‌హ‌రించాల‌నే చ‌ర్చ కూడా వ‌చ్చింద‌ని స‌మాచారం. ఇక్కడ 2014లో టీడీపీతో జ‌ట్టుక‌ట్టి అధికారంలొకి వ‌చ్చారు. అయితే, ఇప్పుడు ఈ పొత్తు ఎప్పుడు తెగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఏపీ విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను నెర‌వేర్చాల‌నే డిమాండ్‌తో మిత్ర ప‌క్షం టీడీపీ ఆందోళ‌న చేస్తుండ‌డం బీజేపీ అధిష్టానానికి అస్సలు న‌చ్చడం లేదు.

వైసీపీతో ఎన్నికల తర్వాత.....

అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఏదో ర‌కంగా స‌ర్దుకుపోవాల‌ని నిర్ణయించుకున్నారు నేత‌లు. అయితే, మ‌రొప‌క్క బాబుకు వ్యతిరేక‌త పెరిగితే ప‌రిస్థితి ఏంటి? అని కూడా అనుకుంటున్నార‌ట‌. అప్పుడు ఎలాగూ ఏకైక ప్రత్యా మ్నాయంగా ఉన్న వైసీపీ ఒక్కటే అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని ముందుగానే భావిస్తున్నారు. అలాగ‌ని ఇప్పటికిప్పుడు టీడీపీతో తెగ తెంపులు చేసుకోవడానికి కూడా బీజేపీ సిద్ధంగా లేదు. ఉన్నట్టుండి టీడీపీతో తెగ‌తెంపులు చేసుకుని.. వైసీపీతో వెళ్తే.. అనేక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జ‌గ‌న్‌తో అంట‌కాగార‌నే యాంటీ ప్రచారం వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ఈ నేప‌ధ్యంలోనే అవ‌స‌రానికి బాబు అన్న విధంగా ఎన్నిక‌ల్లో గెలిచే వ‌ర‌కు బాబుతో ఉండి.. అప్పటి ప‌రిస్థితులను బ‌ట్టి.. అంటే ఎంపీ సీట్లు ఎవ‌రికి ఎక్కువ వ‌స్తే.. వారితో జ‌ట్టు క‌ట్టాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ని తాజాగా ఢిల్లీ నుంచి వ‌చ్చిన క‌బురు. మ‌రి ఇది ఎంత వ‌రకు వ‌ర్కవుట్ అవుతుందో చూడాలి. మ‌రి ఈ లీకుల‌పై ఇప్పటికే ఉప్పు అందుకున్న చంద్రబాబు బీజేపీతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు విష‌యంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో ? చూడాలి.

Similar News