ఆంధ్రప్రేదేశ్ రాజకీయాల్లో టిడిపి, సైకిల్ మధ్య దూరం పెరుగుతుంది. కేంద్రంలోని మోడీ సర్కార్ ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు కలిగించడం లేదని అంతర్గతంగా మధనపడుతున్న పసుపుపార్టీ నెమ్మదిగా గళం విప్పడం ప్రారంభించింది. అందుకు నిదర్శనంగా రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు పై ఫైర్ కావడమే. ఉపాధి హామీ పనుల్లో అధికారపార్టీ అవకతవకలకు పాల్పడుతుందంటూ సోము కేంద్రానికి లేఖ లో ఫిర్యాదు చేయడం పై గోరంట్ల గరం అయ్యారు. విభజన తో నష్టపోయిన రాష్ట్రానికి ఇలాంటి ఫిర్యాదులు మరింత నష్టం తెస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు చౌదరి.
పొత్తు వద్దు వద్దు అని మొత్తుకున్న గోరంట్ల .....
గత ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ స్థానం బిజెపికి పోత్హులో భాగంగా త్యాగం చేసి రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి మారాల్సివచ్చింది బుచ్చయ్య చౌదరి . ఆ సందర్భంలో అసలు కమలంతో పోత్హు ససేమిరా వద్దంటూ పార్టీ అధిష్టానం తో యుద్ధమే చేశారు గోరంట్ల. ఈ పొత్తువల్ల దీర్ఘ కాలంలో పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్నది బుచ్చయ్య అభిప్రాయం. అయినా అప్పుడు ఆయన మాటే అధిష్టానం పట్టించుకోలేదు. పోటీచేస్తే రూరల్ నుంచి చేయాలని కోరడంతో 7 సార్లు పోటీ చేసిన రాజమండ్రి అర్బన్ వదిలి రూరల్ లో సైకిల్ ఎక్కారు చౌదరి.
అధిష్టానం ఆదేశించిందా ...?
వాస్తవానికి ఇటీవల అధిష్టానం పార్టీ నేతలకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణాలో కానీ ఏపీలో కానీ పొత్తులపైనా , మిత్రపక్షం పైనా, జనసేన పార్టీపైనా మౌనంగా వుండాలని కోరింది. దీనిపై సమయానుకూలంగా అధిష్టానమే స్పందిస్తుంది అని స్పష్టం చేసింది. అయినా కానీ గోరంట్ల బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడిపై సీరియస్ వ్యాఖ్యలు చేయడం వెనుక ఆయన్ను అధిష్టానం ఆదేశించిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లేనిపక్షంలో గోరంట్ల వ్యక్తిగతంగా స్పందించే అవకాశాలు ప్రస్తుతం తక్కువే . మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గోరంట్ల పట్ల హై కమాండ్ అంటీముట్టనట్లే వ్యవహరిస్తోంది. ఆయన కూడా దూకుడు తగ్గించే వ్యవహారం నడుపుతున్నారు. మరి ఈ నేపథ్యంలో గోరంట్ల చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతతో కూడినవనే చెప్పాలి.