''మేమేమన్నా.. స్కూలు పిల్లలమా? మాకు బాధ్య తెలియదా ? 20 ఏళ్ల నుంచి సర్వీసులో ఉంటున్నాం. ఏపీ అభివృద్ధికి ఏమీ చేయడం లేదని మాపై నెపం నెట్టేస్తున్నారు? ఎంత మేరకు సమంజసం? ఇలాగైతే.. ఏపీలో పనిచేయలేం''- రెండు రోజుల పాటు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం సమీపంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న పలువురు సీనియర్ కలెక్టర్లు నేరుగా మీడియా ప్రతినిధులతో చేసిన వ్యాఖ్యలివి. ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. కొందరు బాహాటంగానే ప్రభుత్వం తమపై మోపుతున్న భారాన్ని మీడియాతో పంచుకోగా.. మరికొందరు తుగ్లక్ పాలనలోనూ అధికారులపై ఇలాగే మాటలు అనేవారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంతకీ వీరిలో ఇంతగా ఆగ్రహం కట్టలు తెగడానికి కారణం ఏంటి? ఎందుకిలా వ్యాఖ్యానించారు? అని పరిశీలిస్తే.. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలేనని స్పష్టమైంది.
బయటపడుతున్న ఐఏఎస్ లు....
విషయంలోకి వెళ్తే.. రెండు రోజులు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు సదరు కలెక్టర్లను ప్రతి మూడు మాసాలకు ఒకసారి స్వయం పరీక్ష పెట్టుకుని ఎవరికి వారే మార్కులు వేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అభివృద్ధి ఇంటి పేరుగా మార్చుకుని కలెక్టర్లు రాష్ట్రానికి సేవ చేయాలని సూచించారు. అంతేకాదు, తన లాగా మారి (అంటే.. కుటుంబానికి దూరంగా ఉండి) అయినా.. రాష్ట్రానికి సేవ చేయాలన్నారు. ఈ పరిణామాలపై అప్పుడు నవ్వి వదిలేసిన కలెక్టర్లు.. తర్వాత సదస్సు అనంతరం.. తమకు అనుకూలంగా ఉండే మీడియా మిత్రుల వద్ద సీఎం వ్యవహార శైలిపై పరోక్షంగా మండిపడ్డారు. తాము కుటుంబాలను వదులుకుని పనిచేయాలా? మాకేమన్నా ప్రజలు ఓట్లేయాలా? మీరు చెబుతున్న విధంగా మేం పని చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలే గలాభా సృష్టిస్తున్నారని వాపోయారు.
టీడీపీ నేతలే వేలు పెట్టి....
ప్రతి పథకంలోనూ వాళ్లే వేళ్లు పెడుతున్నారు. నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. ఈ విషయంపై చంద్రబాబుకు అనేక సార్లు నివేదికలు అందించాం. కలెక్టర్ల సదస్సులో మీడియా ముఖంగా ఎలాంటి వారినైనా అణిచేయాలని ఆదేశిస్తారని, సదస్సు ఇలా ముగిసి మేం అలా జిల్లాల్లో చర్యలకు సిద్ధం కాగానే సీఎంవో నుంచి ఫోన్లు వస్తున్నాయని, వాళ్ల జోలికి వెళ్లొద్దు. ఆ విషయం పట్టించుకోవద్దు. అని ఆదేశిస్తున్నారని, అలాంటప్పుడు మాపై నెపం వేయడం ఎందుకు ? మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎందుకు ? అని వారు మీడియా మిత్రుల వద్ద వాపోయారు. ఇలాగైతే పనిచేయలేమని వారు కుండబద్దలు కొట్టడం విశేషం. సో.. ఇదీ ఏపీలో కలెక్టర్ల విలాపం!! మరి ఈ నిరసన స్వరాలు పెరిగితే.. బాబుకు మొత్తానికే చేటు తెచ్చే పరిస్థితి ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.