ప్రతిపక్షం లేకుండానే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నెల 10వతేదీ నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. వైసీపీ ఈ సమావేశాలకు హాజరుకాబోమని ప్రకటించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోతే తాము సభలోకి అడుగుపెట్టే ప్రసక్తి లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ శాసనసభ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరోవైపు చంద్రబాబు దీనిపై ప్రత్యేకంగా మంత్రులతో భేటీ అయి చర్చించారు. ప్రభుత్వం మూడున్నరేళ్లలో చేసిన అభివృద్ధి సభలో వివరించడంతో పాటు ప్రతిపక్ష వైసీపీ అభివృద్ధికి అడ్డుపడుతుందన్న సంకేతాలు సభ నుంచి పంపాలని చంద్రబాబు దిశా నిర్దేశనం చేశారు.
బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించనుందా....?
ఈ నెల 9వ తేదీన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు కూడా తమ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, జరుగుతున్న పనులను వివరిస్తూ ప్రశ్నలు వేయాల్సిందిగా చంద్రబాబు ఆదేశించనున్నారు. ముఖ్యంగా పోలవరం, పట్టిసీమ, రాష్ట్రంలో పెట్టుబడులు వంటి 28 అంశాలపై ఏపీ అసెంబ్లీలో చర్చించనున్నారు. ఇప్పటికే స్పీకర్ కోడెల శివప్రసాదరావు వైసీపీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి సభకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అయినా వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చే అవకాశమేలేదు. ఇక సభలో బీజేపీయే ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశమున్నట్లు కన్పిస్తోంది. బీజేపీ ఇప్పటికే మద్యం షాపుల కేటాయింపు, విశాఖ భూకుంభకోణం, పోలవరం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షం రాకపోయినా... సభలో అన్ని విషయాలు చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.