ఆధార్ కార్డు పొందడం ఏపీలో గగనమైపోయింది. ఒకటి కాదు రెండ్రోజులు కాదు రెండు నెలలుగా ఏపీలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ జరగడం లేదు. జనం ఆధార్ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఏపీ ఐటీ శాఖ నిర్వాకం., కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఏపీఆన్‌లైన్ ద్వారా పనిచేసిన యుఐడిఏఐ సర్వర్లను ఎలక్ట్రానిక్ డెలివరీ సిస్టం సర్వర్లకు అనుసంధానించే పేరుతో నవంబర్ 8న నిలిపివేశారు. అప్పట్నుంచి జనానికి చుక్కలు చూపిస్తున్నారు. మీ సేవా కేంద్రాలతో పాటు కార్వీ., ఆధార్ రిజిస్ట్రేషన్ సెంటర్‌లకు సర్వర్లను నిలిపివేసి., కేవలం మూడు ఈ-సేవా కేంద్రాలు., నాలుగైదు బ్యాంకుల్లో మాత్రమే ఆధార్ రిజిస్ట్రేషన్ కల్పించడం ప్రారంభించారు.
ఐటీ శాఖ ఫైల్ క్లియర్ చేసినా....
దీంతో రాష్ట్రంలోని 93 ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలలో ఆధార్ నమోదు ఆగిపోయింది. కార్వీలో కూడా రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. మొదట ప్రైవేట్ సెంటర్లలో రిజిస్ట్రేషన్ భద్రతపై సందేహాలు వ్యక్తం కావడంతో సర్వర్ కనెక్టివిటీ కల్పించడంలో జాప్యం జరిగింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో ఏపీ ఆన్‌లైన్ బాధ్యుల నుంచి ఆధార్ రిజిస్ట్రేషన్ సేవల పునరుద్ధరణ కోసం విజ్ఞప్తులు వెళ్లాయి. దీంతో ఎలక్ట్రానిక్ డెలివరీ సిస్టం అధికారులు యుఐడిఏఐ అనుమతిని కోరారు. ఇప్పటి వరకు ఆధార్ రిజిస్ట్రేషన్‌లు చాలావరకు ఏపీఆన్‌లైన్ ద్వారా జరగడంతో యుఐడిఏఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఫైల్ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ వద్దకు చేరింది. ఐటీ శాఖ ఫైల్ క్లియర్ చేసినా సర్వర్ల పునరుద్ధరణ మాత్రం జరగలేదు. గతంలో ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా సగటున 4వేల వరకు కొత్త ఆధార్ కార్డుల రిజిస్ట్రేషన్ జరిగితే ప్రస్తుతం అది వందల సంఖ్యకు పరిమితమైంది.
బ్యాంకులు విముఖత....
విజయవాడ నగరంలో ఉన్న 14 ఈసేవా కేంద్రాల్లో మూడు ఈ సేవా కేంద్రాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.ఆధార్ రిజిస్ట్రేషన్‌కు వచ్చే ఆదాయం తక్కువగా ఉండటం వల్ల బిల్లుల చెల్లింపు తప్ప ఆధార్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇక బ్యాంకుల్లో ఆధార్ సెంటర్లను ప్రారంభించినా వాటి వల్ల పెద్దగా లాభం లేకపోవడం., అనవసరపు భారంగా భావించడంతో ఆధార్ కేంద్రాలను బ్యాంకు తొలగించేశాయి. కార్వీ., ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలలో ఆధార్ రిజిస్ట్రేషన్ లేకపోవడం., ఉన్న చోట కూడా ఆధార్ నమోదుకు సిబ్బంది నిరాకరిస్తుండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ కూడా ఈ వ్యవహారంపై పట్టనట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు ఎలక్ట్రానిక్ డెలవరీ సిస్టం ఇన్ ఛార్జీ శ్రీనివాస్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.