ఏపీలో అడుగుపెట్టేందుకు రాహుల్...?

Update: 2017-12-28 04:30 GMT

రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత ఒక్కొక్క రాష్ట్రంపై దృష్టిపెడుతున్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఓటమి పాలయినా కొద్ది సీట్లతేడానే కావడంతో ఆ పార్టీకి మరింత భరోసా నిచ్చింది. దీంతో రాహుల్ గాంధీ ఈరోజు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఏపీ నేతలు పల్లంరాజు, నాదెండ్ల మనోహర్, గిడుగు రుద్రరాజు, బాపిరాజు తదితరులు సమావేశం కానున్నారు. వీరితో జరిగే సమావేశంలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. వీరితో పాటు తెలంగాణ నేతలు ఎం.ఎ.ఖాన్, సంపత్ కుమార్ లు కూడా హాజరుకానున్నారు. రెండు రాష్ట్రాల్లో పరిస్థితులను రాహుల్ అడిగితెలుసుకోనున్నారు.

ఆగ్రహంతో ఉన్న ఏపీ ప్రజలను...

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.తమ ఆగ్రహాన్ని గత ఎన్నికల్లోనే ఆ పార్టీకి రుచి చూపించారు. ఒక్క స్థానం కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేశారు. అయితే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీపై కూడా ఏపీ ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. విభజన హామీలు ఏదీ అమలు చేయకపోవడంతో కమలం పార్టీపై ఏపీ ప్రజలు గుర్రుగా ఉన్న మాట వాస్తవమే. ఈ నేపథ్యంలో రాహుల్ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు.

విభజన హామీలను అమలు చేయాలంటూ...

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాహుల్ విజయవాడలో కొన్నాళ్ల క్రితం బహిరంగ సభకూడా పెట్టిన సంగతి తెలిసిందే. ఏపీలో పార్టీ నిలదొక్కుకోవాలంటే విభజన హామీలపై పోరాటం చేయాలని, పార్లమెంటులో కూడా సమస్యలపై గళమెత్తాలన్నది రాహుల్ వ్యూహంగా కన్పిస్తుంది. ఏపీలో అధికారంలోకి రాకపోయినా కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగిపొండడం, శాసనసభ, పార్లమెంటులో ఏపీ నుంచి ప్రాతినిధ్యం ఉండేలా చూడటం రాహుల్ ముందున్నలక్ష్యం. ఇందుకోసమే సీనియర్ నేతలు, ఆంతరింగుకులతో సమావేశం అవుతున్నారు. ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, పీసీసీ ప్రక్షాళన వంటి విషయాలపై రాహుల్ చర్చించనున్నట్లు సమాచారం. మొత్తం మీద రాహుల్ ఏపీపై దృష్టిపెట్టారన్నమాట.

Similar News