ఏపీని కేంద్రం నిలువునా ముంచుతుందా?

Update: 2017-11-23 08:30 GMT

కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని పూర్తిగా విస్మరిస్తోంది. చంద్రబాబు ఎన్ని విన్నపాలు చేసుకున్నా కేంద్రం బుట్టదాఖలా చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలోకి వచ్చాక రెండు పార్టీలూ ఏపీ ప్రజలకు భారీ హామీలే గుప్పించాయి. ఇక విభజన చట్టంలోని హామీలు ఎలాగూ ఉన్నాయి. రాజధానిగా అమరావతిని నిర్ణయించిన తర్వాత చంద్రబాబు అనంతపురం నుంచి అమరావతి వరకూ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణాన్ని తలపెట్టారు. మొత్తం ఆరు లేన్లతో నిర్మించే ఈ రహదారి నిర్మాణాన్ని ఎటువంటి వంకర్లు లేకుండా నేరుగా నిర్మించాలన్నది చంద్రబాబు ఉద్దేశం. రాయలసీమకు రాజధానిని అనుసంధానిస్తూ నిర్మాణం చేపట్టే ఈ రహదారి వల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. అంతేకాదు బెంగళూరు వెళ్లేందుకు కూడా మార్గం సుగమమవుతుంది. ఈ నేపథ్యంలో అనంతపురం -అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణాన్ని ప్రారంభించాలనుకున్నారు చంద్రబాబు. ఈ ప్రతిపాదనను కేంద్రం ముందుకూడా ఉంచారు. కేంద్రం కూడా దీనికి అంగీకరించింది.

ఎక్స్ ప్రెస్ హైవే ఎక్కడ?

ఈ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్రం కూడా తన వంతు సాయం అందిస్తానని చెప్పుకొచ్చింది. అయితే ఈ హైవేకు నెంబరును కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా మొరపెట్టుకుంటున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. రహదారికి కేంద్రం నెంబరును కేటాయించినప్పడే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రవాణా శాఖ నిధులు విడుదల చేసే అవకాశముంది. అయితే ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్రం మాత్రం దీనిపై శ్రద్ధ చూపడం లేదు. అయితే ఇందుకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది. ఆరు లేన్ల రహదారి నిర్మాణం, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉండటంతో వేల కోట్ల రూపాయలు భూమిని కోల్పోయే వారికి నష్టపరిహారం కింద చెల్లించాల్సి ఉంటుంది. అయితే గుంటూరు నుంచి ప్రారంభమయ్యే ఈ రహదారి నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదు. రాజధాని ప్రకటించిన తర్వాత గుంటూరు జిల్లా మొత్తం భూముల ధరలు నింగినంటాయి. రోడ్డు మార్గం కోసం భూమి ఇస్తే తమకు తక్కువ వస్తుందని రైతులు భావిస్తున్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నించినా సత్ఫలితాలివ్వలేదు. అంతేకాదు భూ సేకరణకు అయ్యే వ్యయంలో్ సగం భరిస్తామని అప్పట్లో కేంద్రమంత్రి గడ్కరీ ప్రకటించారు. కాని ఆ ఊసే ఇప్పుడు ఎత్తడం లేదు ఆయన. ముఖ్యంగా పోలవరం పైనే ప్రభుత్వం దృష్టి సారిస్తుండటం, ఆ నిధులను రాబట్టుకునేందుకే చంద్రబాబు ప్రయత్నం చేస్తుండటంతో అమరావతి-అనంతపురం ఎక్స్ ప్రెస్ హైవే ఒక్క అడుగు కూడా ముందుకు సాగడం లేదు. తాము అన్ని రకాలుగా ప్రతిపాదనలు పంపినా కేంద్రం నుంచి అనుమతి రావడం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

Similar News