ఏపీకి అసలు శత్రువు ఆ పార్టీయేనా?

Update: 2018-03-19 22:30 GMT

కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసం చర్చకు రాకుండా అడ్డుకున్నదెవరు? సభ ఆర్డర్ లో ఉంటేనే తాను అవిశ్వాస తీర్మానంపై హెడ్ కౌంట్ చేస్తానని స్పీకర్ పదే పదే చెబుతున్నా వారు మాత్రం వినడం లేదు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీలు వారిని బతిమాలుకున్నా వినడం లేదు. వారే ఆంధ్రప్రదేశ్ కు చెందిన పొరుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలే కావడం విశేషం. గత శుక్రవారం, సోమవారం అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకున్నది కూడా వీరేనంటున్నారు. అయితే ఇందులో తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు రిజర్వేషన్ల అమలు అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలంటూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

అన్నాడీఎంకేల నినాదాలు...

అలాగే ఏపీకి మరొక పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీలు అస్సలు వినడం లేదు. కావేరీ జలాల మండలి ఏర్పాటు విషయంపై వారు కూడా కొద్ది రోజులుగా సభను స్థంభింప చేస్తున్నారు. అయితే సోమవారం మాత్రం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీలు వీరిని బతిమాలారు. అవిశ్వాస తీర్మానం విషయంపై స్పీకర్ ప్రస్తావించినప్పుడు ఎవరి స్థానాల్లో వారు కూర్చుందామని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వారు వినలేదు. తమకు కావేరీ జలాల విషయం ముఖ్యమని వారు వాదిస్తూ సభలో నినాదాలు చేస్తూ ఉన్నారు.

బీజేపీయే వెనకుండి....

అయితే అన్నాడీఎంకే పార్లమెంటు సభ్యుల చేత బీజేపీయే ఈ నినాదాలు చేయిస్తుందన్న వాదన కూడా విన్పిస్తోంది. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకునేందుకు అన్నాడీఎంకేను కమలనాధులు సాధ్యమయినంత వరకూ వాడుకుంటున్నారన్న వ్యాఖ్యలు కూడా పార్లమెంటు ఆవరణలో బలంగా విన్పిస్తున్నాయి. సోమవారం స్పీకర్ అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావించినప్పుడు దాదాపు 150 మంది వరకూ లేచి నిలబడ్డారు. స్పీకర్ కనుక హెడ్ కౌంట్ చేసి ఉంటే అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేది.

బతిమాలినా...ప్రాధేయపడినా.....

కాని అన్నాడీఎంకే సభ్యులు ఏమాత్రం వినలేదు. కావేరీ జలాల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందంటూ వారు నినదిస్తూనే ఉన్నారు. ఒక దశలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు వారి వద్దకు వెళ్లి బతిమాలారు. ఐదు నిమిషాలు ఓపిక పట్టమని ప్రాధేయపడ్డారు. అయినా వారు వినలేదు. నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే స్పీకర్ అవిశ్వాస తీర్మానం చేపట్టకుండా సభను మంగళవారానికి వాయిదా వేశారు. బీజేపీ సభలో తాము అవిశ్వాసంపై చర్చకు సిద్ధమని ప్రకటిస్తూనే, అన్నాడీఎంకేను సభను అడ్డుకోమని చెబుతోందని టీడీపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాలయితే కన్పించడం లేదు.

Similar News