ఏపీ శీతాకాల సమావేశాలు హుళక్కేనా?

Update: 2016-12-15 00:39 GMT

ఒకవైపు తెలంగాణ సర్కారు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమైపోతోంది. సమరాంగణానికి ఆయత్తం అవుతోంది. అదేసమయంలో ఏపీ పరిస్థితి ఏమిటి? ఏపీలో అసెంబ్లీకి ఈ దఫా అసలు శీతాకాల సమావేశాలు ఉంటాయా ? ఉండవా? అనేది మీమాంసగా మారింది. వర్షాకాల సమావేశాలు ముగియగానే.. ఇక అసెంబ్లీ పరంగా హైదరాబాదుతో సంబంధాన్ని పూర్తిగా తెంచేసుకుని వెళ్లిపోయిన ఏపీ.. శీతాకాల సమావేశాలు వెలగపూడిలోని నూతన అసెంబ్లీలోనే ఉంటాయని అప్పట్లో సెలవిచ్చింది. కానీ.. మరో నెల రోజుల వరకూ పనులు పూర్తయ్యే అవకాశం లేకపోగా.. ఎప్పుడు శీతాకాల అసెంబ్లీ నిర్వహిస్తారో తెలియడం లేదు.

అమరావతి వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో నిర్మాణంలో వున్న శాసనసభ, శాసనమండలి భవనాల నిర్మాణాలు మరో నెల రోజుల వ్యవధిలో పూర్తవుతాయని సీఆర్‌డీఏ అధికారులు ముఖ్యమంత్రితో సమీక్ష సమావేశంలో చెబుతున్నారు. సచివాలయం లోపల సుందరీకరణ పనులు పూర్తి కావొస్తున్నాయని, పార్కు నిర్మాణం 70 శాతం పూర్తయిందని తెలిపారు. అధికారులు చెబుతున్న మాటల్ని బట్టి జనవరి నెలాఖరు వరకు కూడా అసెంబ్లీ అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదు. మామూలుగా అయితే జనవరిలో కొత్త అసెంబ్లీలో తొలిసారిగా శీతాకాల సమావేశాలు ఉంటాయని చెబుతూ వచ్చారు. కానీ జనవరి మాసాంతానికి పనులు పూర్తవుతాయన్నది అనుమానమే. ఫిబ్రవరిలో మహిళా పార్లమెంటేరియన్ల అంతర్జాతీయ సదస్సు ఉంది.

ఇప్పటికే ఈ సదస్సు పేరు మీద స్పీకరు కోడెల శివప్రసాద రావు అతిథుల్ని ఆహ్వానించే పేరిట దేశం మొత్తం కాలికి బలపం కట్టుకున్నట్లుగా తిరుగుతున్నారు. ఆ సదస్సు అయ్యే వరకు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు లేనట్టే. ఈలోగా బడ్జెట్ సమావేశాలకే సమయం ముంచుకు వచ్చేస్తుంది. కాబట్టి. ఏ రకంగా చూసినా.. ఈసారి అసెంబ్లీకి శీతాకాల సమావేశాలు ఉండకపోవచ్చునని పలువురు అనుకుంటున్నారు.

Similar News