ఆంధ్రప్రదేశ్ రాజధానిలో తాత్కాలిక హైకోర్టు నిర్మాణానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కూడా తాత్కాలికమే. హైకోర్టును త్వరగా అమరావతికి తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అక్టోబర్ నాటికి హైకోర్టు తాత్కాలిక భవనాన్ని నిర్మించాలన్నది ముఖ్యమంత్రి నిర్ణయం. అయితే శాశ్వత భవనాలకు ఇంకా డిజైన్లు ఖారారు కాకపోవడంతో తాత్కాలిక హైకోర్టు భవనాల నిర్మాణానికే మొగ్గుచూపింది. అయితే తాత్కాలికంగా హైకోర్టును ఏర్పాటు చేసేందుకు ఎటువంటి భవనాలు దొరక్క పోవడంతో తాత్కాలిక భవన నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైకోర్టు తరలింపుకు....
అక్టోబరు 2వ తేదీనాటికి హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణాన్ని పూర్తి చేసి హైకోర్టును ఏపీకి తరలించాలన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే ఈ భవనాన్ని అమరావతిలో ఇప్పటికే కేటాయించిన స్థలంలోనే హైకోర్టు తాత్కాలిక భవనాన్ని నిర్మించాల్సి ఉంటుంది. తాత్కాలిక భవన డిజైన్లను చంద్రబాబు పరిశీలించారు. అయితే ఈ డిజైన్లను ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులకు చూపించిన తర్వాత భవన నిర్మాణ పనులను ఈ నెలలో ప్రారంభించనున్నారు.
108 కోట్ల వ్యయంతో.... తాత్కాలికమా..?
మొత్తం నాలుగు ఎకరాల్లో హైకోర్టు తాత్కాలిక భవనానికి కేటాయించారు. ఇందులో 1.8 లక్షల చదరపు అడుగుల్లో హైకోర్టు తాత్కాలిక భవనాన్ని నిర్మిస్తారు. పర్ధాన న్యాయమూర్తి ఛాంబర్ తో పాటు కోర్టు హాలును కూడా ఇక్కడే నిర్మిస్తారు. ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్ 1200 చదరపు అడుగులు ఉంటుంది. న్యాయమూర్తుల ఛాంబర్లు 600 చదరపు అడుగులు ఉంటాయి. మొత్తం 18 కోర్టు హాళ్లను నిర్మించనున్నారు. వీటన్నిటి నిర్మాణానికి సుమారు 108 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఆరు నుంచి ఎనిమిది నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.దాదాపు 200 కార్లు నిలిపేందుకు పార్కింగ్ సౌకర్యం ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పటికే సచివాలయం, అసెంబ్లీ భవనాలను ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా నిర్మించింది. ఇప్పుడు హైకోర్టు భవనం కూడా తాత్కాలికమని చెప్పడంతో ఏపీ సర్కార్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. తాత్కాలికం పేరుతో ఎన్ని వందల కోట్ల ప్రజాధానాన్ని తగలేస్తారని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం తాత్కాలిక భవన నిర్మాణాలకే మొగ్గుచూపుతోంది.