ఏపీ మంత్రులు హైదరాబాద్ అంటేనే హడలెత్తిపోతున్నారా?

Update: 2017-10-25 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎక్కువ మంది హైదరాబాద్ లోనే ఉంటున్నారు. తమ వ్యాపారాల కోసం వారు పొరుగు రాష్ట్రంలోనే వారానికి రెండు రోజులు గడుపుతున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో ఉండేందుకు పదేళ్ల పాటు అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరాష్ట్రంలో పాలన ఉండాలని, ప్రజలకు చేరువగా ఉండాలని రాజధానిని అమరావతికి ఏడాదిన్నర గడవక ముందే తరలించారు. ఓటుకునోటు కేసుకూడా రాజధాని వేగంగా తరలిపోవడానికి కారణమన్న వారూ లేకపోలేదు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే గడుపుతున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో మంత్రులు హైదరాబాద్ కే ఎక్కువ మంది చేరుకుంటారు. హైదరాబాద్ లో ఏపీ మంత్రులకు, శాసనసభ్యులకు వివిధ వ్యాపారాలున్నాయి. వాటిని పర్యవేక్షించడానికే హైదరాబాద్ ను మంత్రులు గాని, శాసనసభ్యులు గాని ఎక్కువ మంది విడిచిపెట్టడం లేదు.

వీకెండ్ లో ఎక్కువ హైదరాబాద్ కే....

ముఖ్యంగా మంత్రి నారాయణ ప్రతి శని, ఆదివారాల్లో హైదరాబాద్ కు వస్తారు. ఆయన విద్యాసంస్థల బాగోగులు చూసుకుంటారు. అలాగే మంత్రులు ఆదినారాయణరెడ్డి, పరిటాల సునీత, అఖిలప్రియ, కేఈ కృష్ణమూర్తి, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు ఇలా అనేక మంది మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారాంతంలో హైదరాబాద్ లోనే గడుపుతుంటారు. ఇక్కడ ఉన్న వ్యాపారాలను చూసుకోవడానికి ఎక్కువమంది మంత్రులు తమ కుటుంబాలను హైదరాబాద్ లోనే ఉంచారు. చాలా మందికి హైదరాబాద్ లోనే స్థిరనివాసాలుండటంతో హైదరాబాద్ ను వీకెండ్ స్పాట్ గా వీరు ఎంచుకున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి ఏపీ మంత్రులుచేసిన వ్యాఖ్యలు దీనికి అద్దంపడుతున్నాయి. మంత్రులు యనమల రామకృష్ణుడి కంపెనీకి తెలంగాణలో రెండు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు పనులు దక్కాయని, పరిటాల సునీత కుటుంబానికి బీర్ల ఫ్యాక్టరీ లైసెన్సు మంజూరయిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. బయటపడింది వీరిద్దరేనని, ఎక్కువ మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాపారాలకు హైదరాబాద్ అనువైనదిగా భావించడం, కొందరు ఉమ్మడి రాష్ట్రంలోనే బిజెనెస్ లు ప్రారంభించడంతో ఇక్కడికే వీకెండ్ చేరుకుంటున్నారు. మంత్రులు వారాంతంలో సహజంగా తమ నియోజకవర్గాల్లోనో, జిల్లాల్లోనో పర్యటించాల్సి ఉంటుంది. కాని ఏపీ మంత్రుల రూటే వేరు. వారు వీకెండ్ మాత్రం హైదరాబాద్ లోనే ఎక్కువగా గడపటం, సోమవారం ఉదయాన్నే అమరావతికి బయలుదేరి వెళ్లడం రివాజుగా మారింది. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి మంత్రి ఆదినారాయణ రెడ్డి వాహనం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇలా మంత్రుల్లో ఎక్కువ మంది వీకెండ్ హైదరాబాద్ లోనే గడుపుతుండటంపై విమర్శలువస్తున్నాయి. అయితే ప్రతిపక్ష నేతలు కూడా హైదరాబాద్ లోనే ఉండటం వీరికి ఊరటనిచ్చే అంశం. తాజాగా యనమల, పరిటాలపై రేవంత్ చేసిన ఆరోపణలతో ఏపీ మంత్రులు హైదరాబాద్ కు వెళ్లినా తెలంగాణ మంత్రులతో కలవొద్దన్న ఆదేశాలు అధినేత నుంచి అందినట్లు సమాచారం. హైదరాబాద్ వెళ్లొద్దని అధిష్టానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు సొంత ఇల్లు ఇక్కడే ఉండటంతో ఆయన పదిహేను రోజులకొకసారి హైదరాబాద్ కు వచ్చి రెండు రోజులుంటారు. మొత్తం మీద రేవంత్ దెబ్బకు ఏపీ మంత్రులు హైదరాబాద్ రావాలంటేనే భయపడిపోతున్నారు.

Similar News