ఆంధ్రప్రదేశ్ డీజీపీగా గౌతమ్ సవాంగ్ నియామకం లాంఛనం కానుంది. ఈ నెల 30న డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో గౌతమ్ సవాంగ్ కు బాధ్యతలు అప్పగించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. డీజీపీ రేసులో ఆర్పీ ఠాకూర్, సవాంగ్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా., నిబంధనల ప్రకారం నియామకాన్ని పూర్తి చేసేందుకు ఇన్ ఛార్జి చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో సెర్చ్ కమిటీని ఏర్పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.మూడేళ్లుగా విజయవాడ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న సవాంగ్ కే ఈ పదవి దక్కనుంది.
గౌతమ్ వైపే మొగ్గు.....
ఏపీ డీజీపీగా 1986 బ్యాచ్ కు చెందిన గౌతమ్ సవాంగ్ వైపే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. డీజీపీ మాలకొండయ్య స్థానంలో సమర్ధుడైన అధికారిని ఆ పోస్టులో నియమించాలని భావిస్తున్నారు. నిజానికి డీజీపీ పదవికి అర్హులైన ఏడుగురు ఐపీఎస్ లు ఉండగా వారిలో గౌతమ్ సవాంగ్ కే బాధ్యతలు అప్పగించడం అన్ని విధాలుగా అనుకూలమని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఇదే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి డీజీపీ పదవిపై ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ గంపెడాశలు పెట్టుకున్నా., గతంలో డీజీపీ పదవి కోసం కేంద్ర హోంశాఖ ద్వారా ప్రయత్నాలు చేశారనే ప్రచారం ఉండటంతో సవాంగ్ కే అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. నండూరి సాంబశివరావు తర్వాత డీజీపీ బాధ్యత రేసులో నిలిచిన ఠాకూర్ చివరి వరకు ఆ పదవి కోసం ప్రయత్నాలు చేశారు. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఠాకూర్ కు మద్దతిచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అదే సమయంలో నండూరి పదవీ కాలాన్ని పొడిగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి మోకాలడ్డుతూ యూపీఎస్సీ ద్వారా రాష్ట్ర జాబితాను పదేపదే తిప్పి పంపి ప్రభుత్వాన్ని విసిగించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పోలీస్ రిఫార్మ్స్ యాక్ట్ ను సవరించుకుని డీజీపీ నియామకాన్ని తామే చేపడతామని తేల్చి చెప్పింది.
ముఖ్యమంత్రి తర్జన భర్జన.....
ప్రస్తుతం డీజీపీ పదవీ విరమణ చేస్తుండటంతో ఆ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో ముఖ్యమంత్రి సైతం తర్జన భర్జనకు గురయ్యారు. ఆర్పీ ఠాకూర్ కు బీజేపీ నేతలతో సత్సబంధాలున్నాయనే భావనతో ఆయనకు అవకాశం దక్కకపోవచ్చని చెబుతున్నారు. మరోవైపు 1986 బ్యాచ్ కు చెందిన విఎస్ కె. కౌముది చాలా కాలం క్రితమే కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఆయన తిరిగి రాష్ట్రానికి వచ్చే ఆసక్తి కూడా చూపకపోవడంతో ఆయన పేరును పరిగణలోకి తీసుకోలేదు. ఇక జైళ్ల శాఖ డీజీ వినయ్ రంజన్ రే ను అనారోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో ఆయన పేరును పరిగణలోకి తీసుకోలేదని చెబుతున్నారు. మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేసే రమణ మూర్తి కూడా ఆ పదవిపై ఆసక్తి చూపడం లేదు. మరో ఐపీఎస్ దంపతులు ఎన్వీ సురేంద్ర బాబు., హోంశాఖ కార్యదర్శి ఏఆర్ అనురాధలు కూడా డీజీపీ పదవికి అర్హులే అయినా వారిద్దరు ఆ పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. ముక్కు సూటిగా వ్యవహరించే సురేంద్రబాబు ఎన్నికలకు ముందు లేనిపోని తలనొప్పులు ఎందుకని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక హోంశాఖ కార్యదర్వి ఏఆర్ అనురాధ కూడా ఆ బాధ్యతలు చేపట్టేందుకు అంతగా సుముఖత చూపడం లేదని., ఇందుకు గతంలో జరిగిన ఘటనల్ని ఉదహరిస్తున్నారు. ఇంటెలిజెన్స్ బాధ్యతల నుంచి తప్పించినపుడు ఆమె మనస్తాపానికి గురయ్యారని చెబుతుంటారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఏబి వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ కు మార్చిన తర్వాత., ఆ బాధ్యతలు చేపట్టిన సవాంగ్ వివాద రహితుడిగా పేరొందారు.