ఏపీ చేతులెత్తేసినా.. తెలంగాణ సై అంటోంది

Update: 2016-11-30 00:05 GMT

పెద్ద నోట్లరద్దు , బ్యాంకుల్లో నగదు అవసరాలకు చాలినంతగా చెలామణీకి అందుబాటులో లేకపోతుండడం అనే విపరీతమైన కష్టాల నేపథ్యంలో డిసెంబరు ఒకటోతేదీ వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రూపంలో వేతనాల చెల్లింపులు జరపడం గురించి కొన్ని రోజులుగా కసరత్తు జరుగుతోంది. నగదు పొందడానికి బ్యాంకుల వద్ద గంటల, పూటల తరబడి వెచ్చించాల్సి వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం ప్రభుత్వాలు ఈ ఆలోచన చేశాయి. అయితే వ్యత్యాసం ఏంటంటే.. జీతాలు, పెన్షన్లు నగదు రూపంలో ఇవ్వడానికి సాధ్యం కాదని ఏపీ ఆర్థిక శాఖ తేల్చి చెప్పేయగా, తెలంగాణ సర్కారు మాత్రం ఊరట కలిగించింది. ఉద్యోగులకు 10 వేల రూపాయలు నగదు రూపంలో ఇవ్వడానికి అంగీకరించింది.

వేతనాలు కొద్ది మొత్తం అయినా నగదు రూపంలో ఇవ్వడానికి సాధ్యం కాదని ఏపీ సర్కారు తెగేసి చెప్పేయడం విశేషం. పెన్షన్లు పొందుతున్న వారిలో ఎవరికైనా బ్యాంకు ఖాతాలు లేకపోతే ఈ రెండు రోజుల్లో ఏర్పాటుచేసుకోవాల్సిందే తప్ప వేరే గత్యంతరం లేదని తేల్చేశారు.

అయితే తెలంగాణ సర్కారు మాత్రం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. నగదు కష్టాలు వారికి తప్పిస్తూ.. ప్రతి ఉద్యోగికి పది వేల రూపాయలు నగదు రూపంలో చెల్లించేలా మిగిలిన మొత్తాన్ని మాత్రం బ్యాంకుల్లో జమ చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీచేసింది. ఆ రకంగా చూసినప్పుడు తమ ఉద్యోగులకు కష్టాలను దూరం చేయడంలో కేసీఆర్ సర్కారు కాస్త ముందుచూపుతో, ఆచరణాత్మకంగా వ్యవహరించడం గమనార్హం.

Similar News