ఉక్కు సంకల్పం ఉండాలి. దేహదారుఢ్యం దానికి తోడు కావాలి. నాలుగు కిలోమీటర్లు సముద్రంలో ఈదిన వెంటనే 180 కిలోమీటర్లు సైక్లింగ్ ఆగకుండా చేయాలి. అది కూడా పూర్తి అయితే 42 కిలోమీటర్ల దూరం మారథాన్ పరుగు అందుకోవాలి. ఇవన్నీ ఒకటి తరువాత ఒకటి వెంటవెంటనే చేసే దమ్మున్నోడే ఐరన్ మెన్. 1978 నుంచి ప్రతి ఏటా జరిగే త్రాయత్లన్ కార్పొరేషన్ ఆస్ట్రేలియా లో నిర్వహించే ఛాంపియన్ షిప్ పోటీలకు ఉక్కునగరం విశాఖ నుంచి కానిస్టేబుల్ కృష్ణ దేశంలో ఒకే ఒక్కడుగా ఏపీలో తొలి వ్యక్తిగా వెళుతున్నాడు.
అత్యంత సాహసోపేత ప్రయత్నం ....
ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలే పోతాయి. ఈత, సైక్లింగ్,పరుగు మూడు ఒకదానివెంట మరొకటి చేయడం అంటే ఆషా మాషి కాదు. కానిస్టేబుల్ కాకముందు నుంచి స్విమ్మింగ్ లో కింగ్ అయిన కృష్ణ అలుపెరగని సాధన చేయడమే దేశంలో ఒకే ఒక్కడిగా ఈ ప్రతిష్టాత్మక పోటీలకు ఎంట్రీ దక్కేలా చేసింది. ఆస్ట్రేలియా లోని హువాయి దీవుల్లో జరిగే ఈ పోటీల్లో 34 దేశాలనుంచి మూడు నుంచి నాలుగు వేలమంది పాల్గొంటారు. వీరిలో 85 మందిమాత్రమే క్వాలిఫయింగ్ రౌండ్ కి చేరుకుంటారు. ఇప్పటివరకు భారతదేశం నుంచి ఐరన్ మెన్ పోటీలకు 11 మంది మాత్రమే వెళ్ళగా ఈసారి దేశం మొత్తం మీద ఏపీ కానిస్టేబుల్ కృష్ణే ఎంపిక కావడం విశేషం. అరుదైన సాహసవంతమైన ఈ పోటీల్లో ఉక్కు నగరం యువకుడు విజయం సాధించి ఉక్కు మనిషిగా తిరిగి రావాలని తెలుగు పోస్ట్ ఆకాంక్షిస్తుంది.