ఐఏఎస్ లు ఏపీలో ఉద్యోగం అంటేనే భయపడుతున్నారా? అందుకే కేంద్రసర్వీసులకు వెళుతున్నారా? వరుసబెట్టి ఐఏఎస్ లు కేంద్ర సర్వీసులకు వెళ్లడం ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. విజయవాడలో తగిన వసతి సౌకర్యం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రంలో అభివృద్ధి పనులు మందగించడం, నిత్యం సమీక్షలు, సమావేశాలతో ఊపిరి సలపనీయకుండా ఉండటంతో వరుసగా ఐఏఎస్ లు కేంద్రం బాట పడుతున్నారు. ఇప్పటికే ఐదుగురు ఐఏఎస్ లు కేంద్ర సర్వీసులకు వెళ్లారు. తాజాగా సుమితా దావ్రా కూడా కేంద్ర సర్వీసులకు వెళ్లడంతో ఏపీలో ఐఏఎస్ లు వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం విడిపోయి మూడున్నరేళ్లు అయింది. పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉన్నప్పటికీ ప్రజలకు పాలనను చేరువచేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే హైదరాబాద్ నుంచి అమరావతికి మకాం మార్చారు. దాదాపు ఏడాది నుంచి అమరావతిలోనే పాలన కొనసాగుతోంది.
కేంద్ర సర్వీసులకు వెళుతున్న ఐఏఎస్ లు.......
అమరావతిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీని నిర్మించారు. గతంలో విజయవాడలో ముఖ్యమంత్రి ఒక్కరే ఉండేవారు. సమీక్షలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉన్నతాధికారులు వెళ్లి వస్తుండేవారు. కాని ఏడాది నుంచి అక్కడి నుంచే పాలన జరుగుతుండటంతో ఐఏఎస్, ఐసీఎస్ లతో పాటు ఉద్యోగులందరూ విజయవాడలోనే ఉండాల్సి వస్తోంది. విజయవాడలో కార్యాలయాలు ఉన్నప్పటికీ వసతి సౌకర్యం సక్రమంగా లేదన్నది ఉన్నతాధికారుల ఆరోపణ. అందుకే ఇప్పటికీ చాలా మంది ఉన్నతాధికారులు హైదరాబాద్ లోనే స్థిరనివాసం ఏర్పరచుకుని వీకెండ్ లో వెళ్లి వస్తుంటారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం సమీక్షలు చేస్తుండటం, పని వత్తిడి పెరగడం వల్లనే ఐఏఎస్ లు కేంద్ర సర్వీసులను కోరుకుని మరీ వెళ్లిపోతున్నారు. ఇప్పటికే పీవీ రమేష్, అజయ్ సహాని, గిరిధర్, సుమితా దావ్రా వంటి సీనియర్ ఐఏఎస్ లు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. అసలే విభజన సమయంలో రాష్ట్రానికి ఐఏఎస్ ల కొరత ఉంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ లు వెళ్లిపోవడంతో పాలనలో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.