తెలంగాణ నాట ఆ నోట ఈ నోట వినిపిస్తున్న మాట టీఆర్ఎస్..కరడు గట్టిన తెలంగాణ వాదిగా పేరున్న కేసీఆర్‌కు ఈ ఎన్నికలను ఛేదించడం అతి సులువు. ఎందుకంటే పెద్దగా రాజ్య వ్యతిరేకం లేదు. పోరాడే ప్రతిపక్షం అంతకన్నా లేదు. ఉన్న రేవంత్ రెడ్డి మాటలు కూడా ఇంకా ఇంకా దిగజారుతున్నాయే తప్ప నిర్మాణాత్మక వైఖరి ఆయనలో ఏ కోశానా కనబడడం లేదు. ఈ సమయంలో ఆ ఉత్తర కుమార బ్యాచ్ ఏం చేయనుందని.. ఏం చేస్తే బాగుంటుందని..
సామాజికవర్గ సమీకరణాలు మారుతాయా..?
ఎలా .. ఎందుకు .. టీఆర్ఎస్‌కు క్షేత్ర స్థాయిలో అన్ని సామాజిక వర్గాల్లోనూ కాస్తో కూస్తో పట్టుంది. పోరులో ఉన్న ప్పుడు కొన్ని మిలిటెంట్ తరహా మాటలు చెప్పినప్పటికీ ఇప్పుడు ఆపరేషన్ జనాకర్ష్ ని షురూ చేశారాయన. టీడీపీ ఊడ్చుకుపోయిన పార్టీగా మిగిలిన తరువాత ఇక ఖాతాలు తెరవని పార్టీలుగా కొన్ని చిన్నాచితకా ఉన్నాయి. వాటి ప్రభావమూ అంతంత మాత్రమే. పోనీ తెలుగుదేశం కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇన్నేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ ఉద్యమాలేవైనాచేశాయా అంటే అదీ లేదు. ఇక కొద్దో గొప్పో ప్రభావం చూపే కిషన్ రెడ్డి (బీజేపీ), కయ్యానికి కాలు దువ్వే ఓవైసీ (ఎంఐఎం) కూడా ప్రసంగాలకే పరిమితం అవుతున్నారు. ఎప్పటిలానే వామపక్షాలు పోరు బాటలో ఉన్నా వాటి ప్రభావం ఖమ్మం గుమ్మం దాటి రావడం లేదు. ఈ సమయంలో కాంగీయులు రాహుల్ ని నమ్ముకుని తప్పక పనిచేయాలి. కానీ మొన్నటి గుజరాత్ మాదిరిగానే ఇక్కడా ఆయన మాట పనిచేస్తుంది అనుకునేందుకు లేదు.
రెడ్డి సామాజికవర్గం ఎటువైపు ??
కాంగ్రెస్ కు రెండంటే రెండే బలమైన సామాజికవర్గాలు వెన్నుదన్నుగా నిలుస్తాయ్ అన్నది జగద్విదితం. బహిరంగ రహస్యం.. ఎప్పటిలానే ఈ సారి కూడా రెడ్డి సామాజికవర్గంతో పాటు దళితులు నడుస్తారా అన్నది ఓ పెద్ద ప్రశ్న. జిగ్నేశ్ మేవానీ లాంటి నేతలు కర్ణాటక విషయంలోనే హెల్ప్ చేయమని చెప్పినపుడు ఇక తెలంగాణలో ఎలా చేస్తారని.. కనుక ఈ సారి బీసీల జపం అందుకోనుంది కాంగ్రెస్. వారినే శరణు వేడనుంది.వారినే కాకా పట్టనుంది. అందుకనో... ఎందుకనో ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ ని వెతుకుతోంది. బీసీ నాయకుడి గా పేరుండి వివాదరహితుడైతే చాలు అన్న క్వాలిఫికేషన్ ని ఇంటర్నెల్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లో షురూ చేసింది. ఇప్పటిదాకా ఉన్న ఉత్తమ్ (టీపీసీసీ ప్రెసిడెంట్), మాజీ విప్ మల్లు భట్టి విక్రమార్క (వర్కింగ్ ప్రెసిడెంట్) చేస్తున్నదీ చేసిందీ పెద్దగా ఏమీ లేకపోవడం, ఉన్న కొద్దిపాటి ప్రజావ్యతిరేకతని తమకు అనుకూలంగా మలుచుకోలేకపోవడం వీరి మైనస్ లు అన్నది విశ్లేషకుల మాట.
రేవంత్ కు నో ఛాన్స్ ??
ఇప్పటికిప్పుడు ఉత్తమ్ ని కాక మరో రెడ్డి సామాజిక వర్గ నేతకు కీలక పదవి దక్కించే సీన్ లేదు. ఒకవేళ ఉన్నా అందుకు ఆయనను ఎంపిక చేసే అవకాశాలే లేవు. ఎందుకంటే ఆయనను మించిపోయిన సీనియర్లు టీ కాంగ్ లో పదవుల కోసమే నిరీక్షిస్తున్నారు కనుక.. ఈ తరుణంలో రేవంత్ కి దక్కేది దక్కక మానదు అని ఆయన అభిమానులు అనుకుంటే పొరపాటే. ఇప్పటికిప్పుడు ఆయన అనుకునేదేదీ దక్కదు. ఇది నిజం. అదేవిధంగా ఆయన దూకుడు ఏపీలో రోజారెడ్డిని తలపిస్తోంది.ఇది కూడా మణిశంకర్ అయ్యర్ రేంజ్ కి చేరితే గెలవాల్సిన చోట కూడా ఓడిపోవడం ఖాయం. కనుక ఈ సారి రాహుల్ పర్యటనకు వచ్చేలోగానే కొన్ని పేర్లు తెరపైకి వచ్చే సీన్ ఉంది. జాబితాలో పొన్నం, దానం పేర్లు ఉన్నాయి. అదేవిధంగా జీహెచ్ఎంసీ బాధ్యతలు యాదవ సామాజిక వర్గానికి చెందిన సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ కి ఇస్తే ఎలా ఉంటుందన్నదీ పార్టీలో కీలక నాయకుల మధ్య చర్చ జరుగుతోంది.
జగన్ టీం ఎటువైపు ??
వాస్తవానికి తెలంగాణ ఎఫైర్స్ ని గత కొద్దికాలంగా సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తున్నప్పటికీ సున్నిత మనస్కుడైన ఆయన అసంతృప్తులను నివారించలేకపోతున్నారు. జగన్ కూడా నవ్యాంధ్ర లో అధికారమే ధ్యేయంగా కదులుతుండడంతో ఉన్న కొద్ది పాటి ఛార్మింగ్ కూడా ఇక్కడ కోల్పోయారు. సెటిలర్స్ ఓటర్లను జగన్ ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది కానీ ఆయన కేసీఆర్‌తోనే కలిసి అడుగులు వేస్తారు అన్నది పొలిటికల్ సర్కిల్స్ నుంచి వినవస్తోన్న టాక్.
సెటిలర్సే కీలకం??
హైద్రాబాద్ తో సహా చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో సైతం సెటిలర్ల ఓటర్లే కీలకం. అందుకే గెలిచినా గెలవకున్నా నిన్నమొన్నటి వేళ జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం సీమాంధ్ర నేతలతో ప్రసంగాలు ఇప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు.అదేవిధంగా సెటిలర్లను ఆకర్షించేందుకు పవన్ సాయం కూడా కోరవచ్చు.ఎలానూ ఆయన కూడా కాస్త తగ్గి కేసీఆర్‌పైనా టీఆర్ఎస్‌పైనా వ్యాఖ్యలు చేయడం మానుకున్నారు కనుక ఈ సారి జనసేన స్తబ్దుగా ఉన్నా పోటీచేసినా పెద్దగా ఎఫెక్ట్ ఉండదేమో! వాస్తవానికి వీటిని పవన్ పట్టించుకున్నా పట్టించుకోకున్నా పొలిటికల్ పార్టీలు పట్టించుకుంటాయిగా! అందుకనో ఎందుకనో ఈ సారి చిరంజీవి మొదలుకొని బాలయ్య దాకా అందరి అవసరాలు అందరికీ ఉంటాయి. ఎలానో కూడా చూద్దాం. రాజకీయ అవసరాలే లేకుంటే నిన్నమొన్నటి తెలుగు మహాసభల్లో తారాబలంని కేసీఆర్ ఎందుకు కూడగట్టుకున్నట్లు?? సో.. ఎలా చూసుకున్నా కొద్దిగానో గొప్పగానో సాఫ్ట్ వేర్ నిపుణులు , ఉన్నత విద్యావంతులు ఎప్పటిలానే ఈ సారి తటస్థంగా ఉంటారో / విజిల్ బ్లోయెర్స్ గా మారుతారో అన్నది చూడాలిక. వీరిని కూడా పార్టీలు తమకు అనుగుణంగామలుచుకుంటామో.. వీరి దగ్గర కూడా ఏ మంత్రం వేస్తారో ఏమో ఎవరికి ఎరుక.. ఆఖరిగా మందకృష్ణ, ఆర్ కృష్ణయ్య లాంటి నేతలు ఏ పార్టీ వైపు మొగ్గుతారో కూడా రేపటి వేళ ఆసక్తిదాయకమే! వీరి దగ్గర ఓటు బ్యాంకు ఉందో లేదో అన్నది కన్నా వీరి ప్రభావం ఎంతన్నది గౌరవ పార్టీలు అంచనా వేయగలవో లేదో అన్నది కూడా కీలకమే!