ఆంధ్రప్రదేశ్ సమస్యలపై అద్వానీ స్పందించారు. అయితే తాను ఎవరికని చెప్పనని ఆయన ఆవేదన చెందారు. లోక్ సభ సమావేశం ముగిసిన తర్వాత టీడీపీ పార్లమెంటు సభ్యులు అక్కడే కూర్చుని ఉన్న అద్వానీని కలిశారు. గత నాలుగు రోజులుగా చేస్తున్న తమ ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో మీరు కూడా సభలోనే ఉన్నారని, ఆరోజు ఇచ్చిన హామీలను ఇప్పుడు అమలు చేయాలని కోరుతుంటే పట్టించుకోవడం లేదని అద్వానీతో అన్నారు.
మరసారి మాట్లాడతా....
అద్వాని కూడా ఇందుకు స్పందించారు. ఏపీ ఎంపీల ఆందోళన సబబేనన్నారు. నమ్మకమైన మిత్రపక్షం పట్ల ఇలా వ్యవహరించడం తగదని కూడా అద్వానీ అభిప్రాయపడ్డారు. పొత్తు ధర్మాన్ని అందరూ పాటించాలన్నారు. అయితే తాను ఇప్పటికే అరుణ‌్ జైట్లీతో మాట్లాడానని త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామనని తనతో చెప్పారని అద్వానీ వివరించారు. అయితే తాను ఎవరితో చెప్పలేని పరిస్థితి ఉందని ఆయన ఆవేదనతో టీడీపీ ఎంపీలతో అన్నారు. మరోసారి అరుణ జైట్లీతో మాట్లాడతానని ఆయన టీడీపీ ఎంపీలకు హామీ ఇచ్చారు. మీ ఆందోళనలో న్యాయముందని తెలిపారు.
చంద్రబాబు అసంతృప్తి......
రాజ్యసభలో కూడా అరుణ్ జైట్లీ మూడోసారి చేసిన ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు. తాము ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎన్నిసార్లు ఢిల్లీ తిరిగినా, అధికారులను పంపినా, ఆందోళనలు చేసినా కేంద్రం పట్టించుకోక పోవడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తికి లోనయినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకూ పోరాడాల్సిందేనని చంద్రబాబు నేతలతో అభిప్రాయపడ్డారు. ప్రజల సెంటిమెంట్ తో ఆడుకుంటే నష్టపోయేది బీజేపీయేనని ఆయన చెప్పినట్లు తెలిసింది.