రైతులు విజయం సాధించారు. కర్షకుడి మాటే నెగ్గింది. ప్రభుత్వం దిగొచ్చింది. సంఘటిత పోరాటం చేస్తే ఎలాంటి ప్రభుత్వమైనా దిగిరావాల్సిందేనని మహారాష్ట్ర రైతులు నిరూపించారు. రైతుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో తమ నిరసనను రైతులు ముగించారు. మహారాష్ట్రలో గత కొన్నేళ్లుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు చేతికి రాకపోవడం, అలాగే వచ్చిన ఉత్పత్తులకు గిట్టుబాటుధర రాకపోవడంతో వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరోవైపు రుణభారం కూడా పెరిగిపోయింది. దీంతో రైతులు తమ సత్తా చూపేందుకు సిద్ధమయ్యారు.
నాసిక్ నుంచి ముంబయి వరకూ....
అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో రైతులు కిసాన్ లాంగ్ మార్చ్ కు సిద్ధమయ్యారు. గత మంగళవారం యాభై వేల మంది రైతులు నాసిక్ లో పాదయాత్రగా బయలుదేరారు. ఎర్రటోపీలు ధరించి యాభై వేల మంది రైతులు చాలా క్రమశిక్షణతో నాసిక్ నుంచి ముంబయి వరకూ బయలుదేరారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే ప్రభుత్వం కూడా రైతులను ఎట్టిపరిస్థితుల్లో అరెస్టులు చేయవద్దని, అడ్డుకోవద్దని పోలీసులను ఆదేశించడంతో నిన్న ముంబయికి చేరుకున్న రైతులు శాంతియుతంగా ఆందోళన చేశారు. రోజుకు 30 కిలోమీటర్లు నడుచుకుంటూ సంయమనంగా వ్యవహరిస్తూ తమ గమ్యస్థానానికి చేరుకున్నారు. ముంబయిలోని ఆజాద్ మైదానంలో దీక్షకు దిగారు. తమ డిమాండ్లు నెరవేరేవరకూ వెనుదిరిగి వెళ్లబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
దిగొచ్చిన సర్కార్.....
దీంతో ప్రభుత్వం దిగి వచ్చింది. రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించింది. చర్చల్లో ముఖ్యమంత్రి ఫడ్నవిస్ పాల్గొనడం విశేషం. రుణాలను, విద్యుత్తు బిల్లులను వెంటనే మాఫీ చేయాలని, స్వామినాధన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, పంటలకు ఒకటన్నర రెట్లు గిట్టుబాటు ధర ఇవ్వాలని, రైతులకు పింఛను ప్రకటించాలని, ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములను రైతులకే పట్టాలివ్వాలని, వివిధ ప్రాజెక్టుల కింద బలవంతంగా భూములను సేకరించరాదన్నది రైతుల ప్రధాన డిమాండ్లు. అయితే ఈ డిమాండ్లన్నింటికీ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించడంతో రైతులు విజయగర్వంతో వెనుదిరిగారు. ప్రజాస్వామ్య చరిత్రలో ప్రభుత్వం మెడలు వంచిన మహారాష్ట్ర రైతులకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర రైతులు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. వీరి పోరాటంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.