జనవరిలోనూ సోమవారం ఎండ అదరింది. భానుడు తన ప్రతాపాన్ని చూపారు. అయినా వైసీపీ అధినేత జగన్ వెంట వేలాది మంది జనం నడిచారు. ఎండను లెక్క చేయకుండా తన వెంట నడుస్తున్న ప్రజలను చూసి జగన్ ఉప్పొంగిపోయారు. ప్రస్తుతం పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్ వెంట వేలాది మంది ప్రజలు నడిచారు. అనూహ్య స్పందన లభిస్తుండటంతో జగన్ ప్రతి ఒక్కరితో మనసు విప్పి మాట్లాడుతున్నారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. కొందరితో ప్రత్యేకంగా సెల్ఫీలు కూడా దిగుతున్నారు. ప్రతి ఒక్కరూ దేవుడు నీ వెంట ఉన్నారని చెబుతుంటే జగన్ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు అడుగులేస్తున్నారు.
చంద్రబాబు వస్తే....
పూతలపట్టు పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభకు అశేష ప్రజావాహిని తరలి వచ్చారు. ఈ సందర్భంగా జగన్ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే సహకార రంగంలోని ఫ్యాక్టరీలు వాటికవే మూతబడతాయన్నారు. చిత్తూరు జిల్లాలో సహకార రంగంలో ఉన్న రెండు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితులు రావటానికి చంద్రబాబు పాలనే కారణమని చెప్పారు. హెరిటేజ్ ఫ్యాక్టరీని లాభాల బాట పట్టించేందుకే చంద్రబాబు చిత్తూరు డెయిరీని ఒక ప్లాన్ ప్రకారం మూసి వేయించారని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ఆరు చక్కెర ఫ్యాక్టరీలుఉంటే అందులో రెండు సహకార రంగంలోనూ, నాలుగు ప్రయివేటు రంగంలో ఉన్నాయన్నారు. ప్రయివేటు రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు లాభాలు గడుస్తుంటే... సహకార రంగంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు ఎందుకు మూతపడుతున్నాయని ప్రశ్నించారు. ప్రయివేటు ఫ్యాక్టరీ యాజమాన్యాలకు లాభాలు తెచ్చిపెట్టేందుకే సహకార రంగంలో ఉన్న ఫ్యాక్టరీలను మూసివేయిస్తున్నారని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ హయాంలో ఆ రెండు ఫ్యాక్టరీల్లో బకాయీలు చెల్లించి తిరిగి తెరిపిస్తే చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటిని మూసివేయించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
రాత్రి బస ఇక్కడే....
అనంతాపురంలో జగన్ రాత్రి బస చేశారు. కొండారెడ్డిపల్లి, తలపులపల్లి, తాటిలోపు, రంగంపేట క్రాస్ రోడ్స్, పూతలపట్టు, సమనత్తం మీదుగా అనంతాపురం వరకూ పాదయాత్ర చేరుకుంది. ఈరోజు కూడా జగన్ చిత్తూరు జిల్లాలోనే పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా మంచి స్పందన లభిస్తుండటంతో యాత్ర జోరుగా సాగుతోంది.