ఎమ్మెల్యేలపై ఫైర్ అయిన చంద్రబాబు

Update: 2017-11-01 09:40 GMT

సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ సంస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. ఈరోజు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ సందర్భంగా ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ముఖ్యంగా సీఎం రమేష్ దక్కించుకున్న ప్రాజెక్టులు నత్త నడకన నడుస్తుండటంపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సీఎం రమేష్ కు చెందిన సంస్థ చేపట్టిన ప్రాజెక్టులపై ఎక్కువ ఫిర్యాదులు అందతున్నాయన్నారు. కాంట్రాక్టర్లు ఎంతటి పెద్దవారైనా పనుల్లో అలసత్వం ప్రదర్శించడం, అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఇంటింటికీ తెలుగుదేశంలో....

ఇక ఇదే సమావేశంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంపై కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కొన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించడం లేదని అభిప్రాయపడ్డారు. ఇలాగే పని చేస్తే పార్టీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలోని పామర్రు, గన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలు సీ గ్రేడ్ లో ఉండటాన్ని ఆయన తప్పు పట్టారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వారందరినీ గాడిలో పెట్టాలని ఇన్ ఛార్జి మంత్రి యనమల రామకృష్ణుడికి సూచించారు. మరోవైపు ఇప్పటి వరకూ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ద్వారా 83 లక్షల కుటుంబాలను కలుసుకున్నామని పార్టీ నేతలు చంద్రబాబుకు వివరించారు. అయితే ఎక్కువగా మున్సిపల్ సమస్యలే వారి నుంచి అధికంగా వస్తున్నట్లు వివరించారు.

Similar News