ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ఆ పార్టీ నేతల చావుకొచ్చినట్లు కన్పిస్తోంది. ఎక్కడచూసినా జనం నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై నాలుగేళ్లు గడుస్తున్నా ఏం చేశావని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అని ఏ మాత్రం వ్యత్యాసం లేదు.అందరికీ ఒకే రీతిలో సొంత పార్టీ కార్యకర్తల నుంచి, నేతల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు గత నెల 2వ తేదీన ప్రారంభించారు. ప్రతి ఇంటికీ వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కరించాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశం. నిధులు ఎక్కువ అవసరమైన పనులను నేరుగా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపితే సంబంధిత శాఖతో చర్చించి ఆ పనులు పూర్తి చేస్తారు. అయితే చంద్రబాబు చేయించిన సర్వేలో 80 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు తేలిందని ఆయన అనేకసార్లు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం టీడీపీ నేతలకు అలా కన్పించడం లేదు. సమస్యలపై నిలదీయడమే ఎక్కువగా కన్పిస్తుండటంతో ఎమ్మెల్యేలు సయితం ఏం చేయలేకపోతున్నారు. మరోవైపు ఈ కార్యక్రమంతో పార్టీలో గ్రూపులు గొడవ మరింత ఎక్కువయ్యాయి.
గ్రూపులతో కన్ఫ్యూజన్......
ఉదాహరణకు అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కరణం వర్గీయులు వేరు వేరుగా ఈ కార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి చేపట్టిన కార్యక్రమాలతో కార్తకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎవరి వెంట వెళితే ఏం ముద్ర పడుతుందోనన్న బెంగతో కొందరు కీలక కార్యకర్తలు ఈ కార్యక్రమంలోనే పాల్గొనడం లేదట. అలాగే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మంత్రి రావెలపై సొంతపార్టీనేతలే తిరుగుబాటు చేశారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే పీతల సుజాతలు వేర్వేరుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా విజయనగరం జిల్లాలోని ఎమ్మెల్యే చిరంజీవులుపై ఆ పార్టీకార్యకర్తలే తిరగబడ్డారు. లక్ష్మీపురం, చెల్లంనాయుడు వలస గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేను రోడ్లు ఎప్పుడు వేయిస్తారని సూటిగానే ప్రశ్నించారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఎందుకు రోడ్డు వేయలేకపోయారన్నారు. ఇక పేదలకు పక్కా గృహాలను చెప్పిన ప్రభుత్వం ఇంతవరకూ కట్టుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లించకపోవడమేంటని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే నీళ్లు నమలాల్సి వస్తోంది. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పి మెల్లగా అక్కడి నుంచి జారుకోవాల్సి వచ్చింది. నిధులు అడిగితే కయ్యమని లేచే ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ప్రజా సమస్యలు ఎలా చెప్పాలా? అని ఎమ్మెల్యేలు చాలా మంది మదనపడిపోతున్నారు.