సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కారు పార్టీ విజయం సాధించినా ఒక ఎమ్మెల్యేకు మాత్రం కంటిమీద కునుకులేకుండా పోతోంది. ఎందుకంటే ఈయన నియోజకవర్గంలో టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం ఓడిపోయింది. దీంతో ఆ ఎమ్మెల్యే పనితీరుపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు కూడా వచ్చేశాయి. కాని కారుపార్టీకి కంచుకోటగా ఉన్న మందమర్రి డివిజన్ లో మాత్రం ఓటమి పాలయింది. ఇక్కడ ఎమ్మెల్యే, విప్ ఓదేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మందమర్రి డివిజన్ లో అధికార పార్టీ అనుబంధం సంఘం ఓటమికి ఓదేలు పనితీరే కారణమని అధినేత కేసీఆర్ భావిస్తుండగా, కొందరు అధికార పార్టీ నేతలు ఓదేలుపై వ్యతిరేకత సృష్టించేందుకే ఓడించారన్న వాదనలూ విన్పిస్తున్నాయి. ఓదేలు సొంత ఊరులోనే పరాజయం పాలుకావడం ఆయనకు కూడా తలనొప్పిగా మారింది.
ఓదేలు సొంత ఊరిలోనే.....
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి డివిజన్లలో విజయం సాధించాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను రంగంలోకి దించారు. అసెంబ్లీ ఎన్నికలను మరిపించేలా ప్రచారమూ నిర్వహించారు. కాని శ్రీరాంపూర్, బెల్లంపల్లో విజయం సాధించిన అధికార పార్టీ అనుబంధం సంఘం మందమర్రిలో మాత్రం ఓటమి పాలయింది. 800 ఓట్ల కు పైగానే టీబీజీకేఎస్ ఓడింది. దీనిపై విశ్లేషణ చేశారు గులాబీ బాస్. విప్ ఓదేలు సొంత ఊళ్లోనే ఓటమి పాలు కావడం జీర్ణించుకోలేక పోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఓదేలు పై ఉన్న వ్యతరేకతే కారణమని కొందరంటుటే.... కాదు...కాదు ఓదేలు ప్రతిష్టను దిగజార్చడానికే అధికార పార్టీ నేతలు దగ్గరుండి ఓడించారని ఓదేలు సన్నిహితులు చెబుతున్నారు.
కుట్ర జరిగిందంటున్న ఓదేలు వర్గం......
ఓదేలును నియోజకవర్గంలో బలహీనపర్చడానికే కొందరు అధికార పార్టీ నేతలు పావులు కదిపారని చెబుతున్నారు. మాజీ ఎంపీ వివేక్ టీఆర్ఎస్ లో చేరడంతో ప్రస్తుత ఎంపీ బాల్క సుమన్ కు వచ్చే ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ వస్తుందో లేదో అన్న అనుమానం బయలుదేరింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని సుమన్ భావిస్తున్నారు. ఇందుకోసం తనకు అనుకూలమైన నియోజకవర్గం కోసం సుమన్ వెతుక్కుంటున్నారు. చెన్నూరు నియోజకవర్గంపై సుమన్ కన్నేశారని తెలిసిన ఎమ్మెల్యే ఓదేలు దానిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి కట్టుగా ఉంటున్నట్లు కన్పించినా...లోపల మాత్రం విభేదాలు తీవ్రంగానే ఉన్నాయి. ఇందుకు సుమన్ మాజీ ఎంపీ వివేక్ సాయంతో మందమర్రి డివిజన్లో అధికార పార్టీ అనుబంధసంఘాన్ని ఓడించేందుకు ప్రయత్నించారని ఓదేలు వర్గం ఆరోపిస్తోంది. వారి రాజకీయ భవిష్యత్ కోసం తనను బలిపశువును చేశారని ఓదేలు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసీఆర్ కు వివరణ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. మరి ఓదేలు వివరణను కేసీఆర్ అంగీకరిస్తారా? లేదా? చూడాలి.