ఎమ్మెల్యే ఫేస్ బుక్ పోస్ట్... ఉద్రిక్తత... కర్ఫ్యూ....!

Update: 2018-01-07 18:29 GMT

వివాదాస్పద వ్యాఖ్యలతో కేరళ ఎమ్మెల్యే ఒకరు చిక్కుల్లో చిక్కుకున్నారు. కేరళలోని త్రితల ఎమ్మెల్యే వీటీ బలరామ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత. అయితే ఆయన కమ్యూనిస్టు నేత గోపాలన్ వైవాహిక జీవితం గురించి ఫేస్ బుక్ లో చేసిన పోస్టు కేరళలో సంచలనంగా మారింది. గోపాలన్ 12 ఏళ్ల వయస్సున్న సుశీలను వివాహం చేసుకున్నాడని, ఆయనకు అప్పటికే మరో భార్య ఉన్నారని, దీంతో ఆయన చట్టాన్ని ఉల్లంఘించారని, మైనర్ పై లైంగిక వేధింపులకు గోపాలన్ పాల్పడినట్లేనని పోస్ట్ చేశారు.

కాంగ్రెస్ నేత కార్యాలయంపై దాడి...

దీంతో కేరళలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల కర్ఫ్యూను కూడా విధించాల్సి వచ్చింది. కాంగ్రెస్ నేత బలరామ్ పై కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలపట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటీ బలారామ్ వ్యాఖ్యలకు నిరసనగా కేరళలోని డివైఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బలరామ్ కార్యాలయాన్ని తగులబెట్టేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. తనపై గోపాలన్ మద్దతుదారులే మద్యంబాటిళ్లతో దాడి చేసినట్లు బలరాం ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈ ఎమ్మెల్యే ఫేస్ బుక్ పోస్టింగ్ కర్ఫ్యూకు దారితీసింది.

Similar News