ఎట్టకేలకు గడ్కరీ అంగీకరించారే......!

Update: 2018-01-31 03:30 GMT

ట్రాన్స్ స్ట్రాయి నిర్వాకం, రాష్ట్ర ప్రభుత్వం పని తక్కువ ప్రచారం ఎక్కువ చేయడంతో అటకెక్కిన పోలవరం పనులను తిరిగి పట్టాలు ఎక్కించే పనికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రపంచ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన రాయపాటి సాంబశివరావు అల్లుడుకి చెందిన ట్రాన్స్ స్ట్రాయి పోలవరం ప్రధాన డ్యామ్ నిర్మాణ కాంట్రాక్ట్ పొందిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ సత్తా తెలిసినా, పనులు నత్త నడకన పనులు సాగిస్తున్నా ప్రాజెక్ట్ పర్యవేక్షణ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం శరవేగం పోలవరం అంటూ ప్రచారం చేస్తూ వచ్చింది. నిజాలు కప్పిపుచ్చి 2018 కే గ్రావిటీపై నీళ్ళు ఇచ్చేస్తున్నామంటూ అమరావతి తరహాలోనే గ్రాఫిక్స్ ప్రచారం ఉవ్వెత్తునే చేపట్టింది. దీనికి తోడు ఎత్తిపోతల పధకం పట్టిసీమ తో నదుల అనుసంధానం సాగింది అంతా అయిపొయింది అని ప్రచారం చేశారు. ఇక ఆ ప్రకటనలు వ్యాఖ్యలకు అధికార పార్టీ మీడియా ఉదరగొట్టేలాగే తమవంతు బాకాలు నడిచాయి.

పోలవరం పనుల పనితీరు అందరికి తెలియడంతో ....

చూస్తుండగానే 2018 వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ పనులు వేగంగా చేయడం లేదు అని మొదలు పెట్టింది. మూడున్నరేళ్ళు అదే సంస్థను ఆహా...ఓహా అన్న సర్కార్ ఉహు.... ఉహు అంటూ కూనిరాగాలు మొదలు పెట్టి కొత్త టెండర్లు పిలిచింది. దాంతో అల్లరి మొదలైంది. నిబంధనలు సైతం సక్రమంగా లేకుండా ప్రకటించిన టెండర్లను కేంద్రం రద్దు చేసింది. దీనిపై ఏపీ సర్కార్ గగ్గోలు పెట్టడంతో పాత కాంట్రాక్టర్ కే మరో నెల గడువు ఇచ్చింది. అది కూడా పూర్తి అయ్యేలోగానే సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేక ట్రాన్స్ స్ట్రాయ్ చేతులు ఎత్తేసింది. ఈ వ్యవహారంపై ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నవయుగ సంస్థ నష్టం వచ్చినా పోలవరం పేరు కోసం కట్టేస్తుందని కేంద్రం అనుమతి కోరింది.

విస్తృత చర్చల తరువాత ఒకే చెప్పిన గడ్కరీ ...

తాజాగా పోలవరం వ్యవహారంపై కేంద్ర జలవనరుల అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు కేంద్రమంత్రి గడ్కరీ. ఈ సమావేశానికి నవయుగ కాంట్రాక్టర్ లు, ఏపీ ప్రభుత్వ అధికారులు పాల్గొని నవయుగ శక్తి సామర్ధ్యాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో నిర్ణయించిన ధరకే పోలవరం నిర్మాణం చేయడానికి నవయుగ అంగీకరించింది. కేంద్రం కూడా పాత ధరకు అయితేనే షరతు నొక్కి చెప్పడంతో నవయుగ ఒకే చెప్పింది. పోలవరం స్పిల్ వే, కాంక్రీట్ పనులు ఇప్పుడు నవయుగ చేపట్టనుంది. ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ పొందుతూ ఎంఓయూ జరిగిన వెంటనే వేగవంతంగా పనులు జరిపి 2019 మార్చి నాటికి పూర్తి చేయాలని కేంద్రమంత్రి గడ్కరీ ఆదేశించారు. మరి ఇప్పుడైనా పోలవరం ముందుకు సాగుతుందా ప్రభుత్వాల ప్రచారానికే పరిమితం అవుతుందా అన్నది వేచి చూడాలి.

Similar News