వైసీపీ నుంచి కర్నూలు పార్లమెంటు సభ్యురాలిగా గెలిచిన బుట్టా రేణుక ఎందుకు పార్టీని వీడదామనుకుంటున్నారు? ఇక కేవలం ఎన్నికలకు ఏడాదిన్నర మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో పార్టీ మారితే ప్రజలు మరోసారి ఆదరిస్తారా? ఇవన్నీ ఆలోచించకుండా బుట్టా రేణుక ఎందుకు పార్టీని వదిలేద్దామనుకుంటున్నారంటే..... బుట్టా రేణుక గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గంలో పనులు కాకపోవడం, గత ఎన్నికల్లో ఖర్చు చేసిన సొమ్మును కూడా తాము సంపాదించుకోక లేకపోవడం ప్రధాన కారణాలయితే... మరొక ముఖ్య కారణం ఎప్పుడు రాజీనామాచేయాల్సి వస్తుందో తెలియకపోవడం. ప్రధాన కారణం ఇదేనని బుట్టా అనుచరులు చెబుతున్నారు. ఈ మధ్య జగన్ ప్రత్యేకహాదా నినాదాన్ని మళ్లీ అందుకున్నారు. ఇటీవల అనంతపురం జిల్లాలో జరిగిన యువభేరి కార్యక్రమంలో జగన్ ఒక ప్రకటన చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్రం దిగిరాకపోతే చివరి అస్త్రంగా ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని ప్రకటించారు.
రాజీనామాకు భయపడేనా?
అయితే ఈ ప్రకటన ఒక్క రేణుకకే కాదు మిగిలిన ఎంపీల్లోనూ కలవరం బయలుదేరింది. మరో ఏడాది పదవి కాలం ఉన్నప్పుడే రాజీనామా చేయమంటే తమ పరిస్థితి ఏందని కొందరు అప్పటికే చర్చించుకున్నారట. మేకపాటి లాంటి సీనియర్ ఎంపీలు కాకుండా మిగిలిన ఎంపీలు జగన్ ప్రకటనపై కొంత ఆందోళనలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో బుట్టారేణుక మరింత ఆందోళన చెందారు. వైసీపీలోనే కొనసాగితే జగన్ ఎప్పుడు చెబితే అప్పుడు రాజీనామా చేయాల్సి వస్తుందేమోనని భయపడ్డారు. వాస్తవానికి ఎప్పటినుంచో బుట్టా రేణుక పార్టీ మారతారని భావిస్తున్నా దాదాపు మూడున్నరేళ్ల నుంచి పార్టీని వీడకుండా అంటిపెట్టుకునే ఉన్నారు. పార్లమెంటులో కూడా అనేక ప్రశ్నలపై మాట్లాడి రేణుక మంచి మార్కులే కొట్టేశారు. ఇటు నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలుకావడం, కోట్ల సూర్యప్రకాశరెడ్డి వైసీపీలోకి వస్తారన్న వార్తలు రావడం, మరోవైపు జగన్ ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని ప్రకటన చేయడంతోనే బుట్టా రేణుక పార్టీ మారేందుకు తొందరపడుతున్నట్లు సమాచారం. అందుకే చంద్రబాబును కలిసి వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే సీటు కావాలని కోరినట్లు తెలుస్తోంది. మొత్తం మీద రేణుక భయపడింది రాజీనామాకేనన్నది కర్నూల్ జిల్లాలో టాక్.