టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రాయపాటి కంపెనీ అయిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి చెందిన వాహనాలను, యంత్రాలను బ్యాంకు అధికారులు సీజ్ చేశారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ గతంలో 87 కోట్ల రూపాయల రుణాన్ని దేనా బ్యాంకునుంచి పొందింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వడ్డీ కూడా చెల్లించడం లేదు. దీంతో ఆ అప్పు...120 కోట్లకు చేరుకుంది. నోటీసులకు కూడా ఎలాంటి సమాధానాలు లేవు.
ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ వాహనాలు సీజ్...
దీంతో ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి చెందిన వాహనాలను, యంత్రాలను దేనా బ్యాంకు అధికారులు ఈరోజు సీజ్ చేశారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పోలవరం ప్రాజెక్టు పనులనుచేస్తున్న సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు పనుల వద్దకు వెళ్లిన దేనా బ్యాంకు అధికారులు దాదాపు 45 వాహనాలను, యంత్రాలను సీజ్ చేశారు. బ్యాంకు రుణం చెల్లించకపోవడంతోనే సీజ్ చేసినట్లు తెలిపారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ కెనరా బ్యాంక్ కు దాదాపు 725 కోట్ల రూపాయలు బాకీ పడింది. కెనరా బ్యాంకు ఇప్పటికే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో దివాలా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు పనులకు ఈ పరిణామం ఆటంకంగా మారిందని చెప్పొచ్చు.